- మన రిఫైనరీలపై ప్రభావం పడే అవకాశం
వాషింగ్టన్: రష్యా, ఇరాన్‌ల నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఇచ్చిన ఆంక్షల సడలింపులను ఇకపై పొడిగించబోమని అమెరికా తెలిపింది. ఈ నిర్ణయం రష్యా నుంచి భారీగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈమేరకు బుధవారం అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ విలేకర్లతో మాట్లాడారు. ‘‘రష్యా, ఇరాన్ చమురుపై ఇస్తున్న ఆంక్షల సడలింపును మేం పొడిగించడం లేదు. మార్చి 11వ తేదీ కంటే ముందే లోడింగ్ పూర్తయి రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే ఈ సడలింపు వర్తించింది. ఆ నిల్వల వినియోగం ఇప్పటికే పూర్తయింది’’ అని తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో సరఫరాను పెంచి ధరలను తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం గతంలో ఈ సడలింపులను ఇచ్చింది. అయితే, తాజా నిర్ణయం ఆంక్షల మినహాయింపులకు ముగింపు పలికినట్లయింది. రష్యా చమురుకు మార్చి12న ఇచ్చిన సడలింపు ఏప్రిల్11తో ముగిసింది. ఇరాన్ చమురుకు మార్చి 20న ఇచ్చిన సడలింపు ఏప్రిల్ 19తో ముగియనుంది. దీని ద్వారా సుమారు 14 కోట్ల బ్యారెళ్ల చమురు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరింది.
- మూడు కోట్ల బ్యారెళ్ల ఆయిల్‌కు భారత రిఫైనరీల ఆర్డర్లు
రష్యా చమురుపై ఆంక్షల సడలింపుతో భారత్‌కు ఎంతో లాభం చేకూరింది. అంతర్జాతీయంగా సరఫరాకు ఆటంకాలు ఏర్పడిన సమయంలోనూ భారత రిఫైనరీలు రష్యా నుంచి అదనపు నిల్వలను సేకరించగలిగాయి. ఈ సడలింపు కాలంలో భారత రిఫైనరీలు సుమారు 3 కోట్ల బ్యారెళ్ల రష్యా చమురు కోసం ఆర్డర్లు ఇచ్చాయి. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు జనవరిలో రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించినప్పటికీ, సడలింపుల తర్వాత మళ్లీ పెంచాయి.
- అమెరికా స్థావరాలపై నిఘాకు చైనా శాటిలైట్
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా సైనిక స్థావరాలను గుర్తించడానికి ఇరాన్ ఒక రహస్య చైనా ఉపగ్రహాన్ని ఉపయోగించినట్టు ఓ రిపోర్టు తెలిపింది. గతేడాది ఇరాన్ రహస్యంగా చైనా నుంచి సేకరించిన ఈ శాటిలైట్ సహాయంతో అమెరికా స్థావరాలపై నిఘా పెట్టిందని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పేర్కొంది. చైనాకు చెందిన ‘ఎర్త్ ఐ కంపెనీ’ అభివృద్ధి చేసిన ‘టీఈఈ01బీ’ అనే ఉపగ్రహాన్ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఏరోస్పేస్ ఫోర్స్ తన ఆధీనంలోకి తీసుకుంది.
చైనాలో తయారైన స్పేస్ క్రాఫ్ట్‌ను కక్ష్యలోకి చేర్చిన తర్వాతే విదేశీ కొనుగోలుదారులకు బదిలీ చేసే ‘ఇన్-ఆర్బిట్ డెలివరీ’ అనే పద్ధతి ద్వారా దీనిని ఇరాన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా బీజింగ్‌కు చెందిన ‘ఎంపోశాట్’ అనే సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ గ్రౌండ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను వాడుకునే వెసులుబాటును కూడా ఐఆర్‌జీసీ పొందింది. ఈ నిఘా ఉపగ్రహం సౌదీ అరేబియా, జోర్డాన్ , బహ్రెయిన్, కువైట్, జిబౌటి, ఒమన్‌లోని అమెరికా సైనిక శిబిరాలతో పాటు యూఏఈలోని ఖోర్ ఫక్కన్ కంటైనర్ పోర్ట్, విద్యుత్ ప్లాంట్లు, బహ్రెయిన్‌లోని అతిపెద్ద అల్యూమినియం ప్లాంట్‌పై దృష్టిసారించింది.

