కోచింగ్ కంప్లీట్ అవుతున్నా స్టైఫండ్, బుక్స్ ఇయ్యలే

కోచింగ్ కంప్లీట్ అవుతున్నా స్టైఫండ్, బుక్స్ ఇయ్యలే

కరీంనగర్, వెలుగు: బీసీ స్టడీ సర్కిళ్లలో ఎస్సై, కానిస్టేబుల్ ఎగ్జామ్స్​కోసం మూడు నెలలుగా కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులకు పరీక్ష దగ్గర పడుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేయలేదు. గ్రూప్–2 కోచింగ్ ప్రారంభమై నెల దాటినా వారికి కూడా స్టైఫండ్, బుక్స్ ఇవ్వలేదు. మొన్నటి వరకు గ్రూప్–1 మెయిన్స్ కోచింగ్ తీసుకున్న అభ్యర్థులదీ ఇదే పరిస్థితి. నెలలు గడుస్తున్నా ఇప్పుడున్న అభ్యర్థులకే స్టైఫండ్, స్టడీ మెటీరియల్ ఇవ్వలేని ప్రభుత్వం.. కొత్తగా కోచింగ్​లో చేరేవాళ్లకు ఎలా ఇస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి, 24 గంటలూ తెరిచి ఉంచుతామన్న ప్రభుత్వ పెద్దల మాటలు కూడా ఆచరణలోకి రావడం లేదు. సాయంత్రం 5 గంటలకే మూసివేస్తున్నారు. దీంతో సాయంత్రం వరకు క్లాసులు వింటున్న అభ్యర్థులకు.. స్టడీ సర్కిళ్లలోని లైబ్రరీలో బుక్స్ చదివే చాన్స్ ఉండడం లేదు.

చెప్పిందొకటి..చేసేదొకటి

సీఎం కేసీఆర్ నిరుడు ఉద్యోగాల ప్రకటన చేయ గానే.. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో నియోజకవర్గంలో  రీడింగ్ రూమ్, ఆన్ లైన్ క్లాస్ రూం, డౌట్ క్లియరెన్స్ రూమ్స్​తో 103 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి 1.25 లక్షల మంది బీసీ అభ్యర్థులకు కోచింగ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన స్టడీ సెంటర్లను ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు అప్పగించడం, వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల తూతూమంత్రంగా నడిచాయనే ఆరోపణలున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25 వేల మందికి డైరెక్ట్​గా, మరో 50 వేల మందికి ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతిలో కోచింగ్ ఇస్తామని అప్పట్లోనే సర్కారు ప్రకటించింది. ఈ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకుని 974 మంది గ్రూప్ –1 ప్రిలిమ్స్ రాస్తే 174 మంది క్వాలిఫై అయ్యారు.  గ్రూప్ –2, ఎస్సై, కానిస్టేబుల్ మెయిన్స్ కోచింగ్ కు సెలక్టయిన అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ తోపాటు ఒక్కొక్కరి నెలకు రూ.2 వేల చొప్పున మూడు నెలలపాటు స్టైఫండ్‌‌ అందిస్తామని చెప్పింది. అయితే నెలకు ఇచ్చే ఈ మొత్తాన్ని  రూ.1000కి తగ్గించింది. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మూడు నెలలు పూర్తయినా స్టైఫండ్​ ఇవ్వలేదు. గ్రూప్ –1 మెయిన్స్ కు రెండు నెలలుగా ఇస్తున్న కోచింగ్ ను.. పేపర్ లీకేజీ ఘటనతో అర్ధంతరంగా నిలిపివేశారు. వారికి ఇస్తామన్న రెండు నెలల స్టైఫండ్​ రూ.10 వేలు కూడా ఇవ్వలేదు.

వచ్చే నెల 8న పరీక్ష.. ఇంకా బుక్స్​ రాలే 

ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఏప్రిల్ 8న మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. దీనికోసం రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వంద మంది చొప్పున కోచింగ్ తీసుకుంటున్నారు. వీరికి ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు. దీంతో రోజూ క్లాసులో లెక్చరర్ చెప్పే నోట్స్ తోనే రివిజన్ చేసుకోవాల్సి వస్తోంది. ఒకవైపు బుక్స్ వస్తాయని ఎదురుచూస్తుంటే.. స్టడీ మెటీరియల్ కోసం రూ.1600 త్వరలోనే చెల్లిస్తామని బీసీ సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మెయిన్స్ కు కావాల్సిన11 బుక్స్ కొనాలంటే రూ.5 వేల వరకు ఖర్చవుతుందని, ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో మూడు బుక్స్ కూడా రావని అభ్యర్థులంటున్నారు. పరీక్ష దగ్గర పడుతున్నా మెటీరియల్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కిరాయి రూములు..అప్​ అండ్​ డౌన్​

రాష్ట్రంలోని ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నారు. బీసీ స్టడీ సర్కిళ్లలో స్టైఫండ్  ఇవ్వకపోగా.. భోజనం, హాస్టల్ అకామిడేషన్ కూడా కల్పించడం లేదు. దీంతో స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకునే అభ్యర్థులు బయట రూముల్లో కిరాయికి ఉండడం లేదా సొంతూళ్ల నుంచి అప్ డౌన్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో  ఖర్చు తడిసి మోపడవుతోంది. రాష్ట్రంలో ఒక్క కరీంనగర్ స్టడీ సెంటర్ లో మాత్రమే బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు చొరవతో రూ.5 భోజనం పెట్టిస్తున్నారు. మిగతా చోట్ల అది కూడా లేదు. కరీంనగర్ లో నిర్మించిన ఈ స్టడీ సర్కిల్ లో గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్ కోసం రూమ్ లు కేటాయించినప్పటికీ.. బిల్డింగ్ లోని ఖాళీ రూమ్ లను వినియోగంలోకి తేవడం లేదు. సిటీకి దూరంగా ఉన్న ఈ స్టడీ సర్కిల్ కు వెళ్లొచ్చేందుకు తమకు రోజుకు రూ.100 ఖర్చవుతోందని  అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

15 సెషన్లతోనే ఆపేస్తున్నరు 

ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లకు దీటుగా స్టడీ సర్కిళ్లలో కోచింగ్ ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ.. క్లాసులు ఆ స్థాయిలో చెప్పించడం లేదు. ఉదాహరణకు గ్రూప్ –2 పరీక్షకు ఉన్న సిలబస్ దృష్ట్యా ఒక్కో సబ్జెక్ట్ కు 50 నుంచి 60 సెషన్లు ఇస్తే సిలబస్ కవర్ అవుతుంది. కానీ, బీసీ స్టడీ సర్కిళ్లలో 15, 16 సెషన్లతోనే ఆపేస్తున్నారు.  దీంతో సిలబస్ పూర్తి కావట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన సెషన్ లో సిలబస్ పూర్తి చేసేందుకు లెక్చరర్లు షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. 

వచ్చిపోవడానికి రూ.100  అవుతుంది.. 

ఎస్సై, కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక బీసీ స్టడీ సర్కిల్ కు వెళ్తున్నా. సిటీకి దూరంగా ఉండడంతో నాకు వచ్చి వెళ్లేందుకు రోజుకు రూ.100 అవుతోంది. ఈ స్టడీ సర్కిల్ లో గర్ల్స్ హాస్టల్​ రూమ్స్​ఖాళీగా ఉన్నాయి. దానికి బదులు కోచింగ్ కు వచ్చేవాళ్లకు ఇచ్చినా బాగుండేది. బయట రెంట్ కు రూమ్స్​ తీసుకుని ఉండడం ఇబ్బందిగా ఉంది.  
–సుప్రియ, ఎస్సై అభ్యర్థి 

ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి.. స్టైఫండ్.. బుక్స్ ఏవి?  

వచ్చే నెల 9న ఎస్సై, 30న కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఏప్రిల్ 4తో కోచింగ్ పూర్తవుతుంది. ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నా స్టైఫండ్​, స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు. స్టైఫండ్​ ఇస్తే మాకు రూమ్ రెంట్, ట్రావెలింగ్ చార్జీలకు ఉపయోగపడేవి. 
–మహేశ్, ఎస్సై అభ్యర్థి

'అభ్యర్థుల‌‌కు న్యాయం చేయాల‌‌నే ఉద్దేశంతో గ్రూప్-1, టీపీబీఓ, డీఏఓ, ఏఈఈ ఎగ్జామ్స్ కు సంబంధించిన మెటిరీయ‌‌ల్‌‌ను ఆన్‌‌లైన్‌‌లో అందుబాటులో పెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ స‌‌ర్కిళ్లను బ‌‌లోపేతం చేస్తాం. రీడింగ్ రూమ్స్ 24 గంట‌‌లు తెరిచి ఉంటాయి. ఫ్రీ మెటిరీయ‌‌ల్‌‌తోపాటు ఉచిత భోజ‌‌న వ‌‌స‌‌తి కూడా క‌‌ల్పిస్తాం.  
–ఈ నెల18న  ప్రెస్ మీట్ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్