యాదాద్రి ప్రారంభానికి చినజీయర్​కు అందని పిలుపు

యాదాద్రి ప్రారంభానికి చినజీయర్​కు అందని పిలుపు
  • కలెక్టర్ ఇచ్చిన ప్రకటనలో కనిపించని పేరు 
  • ఈ నెల 21 నుంచి 28 వరకు సుదర్శన యాగం 
  • 28 నుంచే ప్రధానాలయంలో భక్తులకు దర్శనం
  • ఆలయ అర్చకులతోనే మహాకుంభ సంప్రోక్షణ పూజలు

యాదాద్రి / యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి ప్రారంభానికి చినజీయర్​కు పిలుపు అందలేదు. ఆలయ ప్రారంభానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరు ఎక్కడా లేదు. ఆలయ ప్రారంభ ఏర్పాట్లపై గురువారం యాదాద్రిలో అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి 28 వరకు మహాకుంభ సంప్రోక్షణ పూజల్లో భాగంగా బాలాలయంలో ఆంతరంగికంగా పంచకుండాత్మక మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

ఈ యాగంలో 108 మంది పారాయణికులు, ఆలయ వేద పండితులు పాల్గొంటారని చెప్పారు. చినజీయర్ పెట్టిన ముహూర్తానికే పూజలు జరుగుతాయని పేర్కొన్నారే తప్ప.. ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయని మాత్రం చెప్పలేదు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొనగా, అందులోనూ చినజీయర్ పేరు లేదు. పైగా ఆలయాన్ని తామే ప్రారంభిస్తామని స్థానిక అర్చకులు కూడా మీడియాతో చెప్పారు. 

28న మహాకుంభ సంప్రోక్షణ... 
సుదర్శన యాగాన్ని ఈ నెల 21న ఉదయం స్వస్తివాచనంతో ప్రారంభించనున్నారు. 108 మంది పారాయణికులు, వేద పండితులు ఏడు రోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు. 28న ఉదయం 11:55 గంటలకు మిథున లగ్నంలో మహా కుంభాభిషేకంతో మహా కుంభ సంప్రోక్షణ చేసి ఆలయ ఉద్ఘాటన జరపనున్నారు. అంతకుముందు ఉదయం 7:30 గంటల నుంచి నిత్య హోమాలు, చతుస్థానార్చన పరివార శాంతి ప్రాయశ్చిత్త హోమం, శాలబలి పూజలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, మిథున లగ్నంలో గర్తవ్యాసం, రత్నవ్యాసం, యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ, అష్టబంధనం, కళారోహణం, ప్రాణప్రతిష్ఠ, నేతోన్మీలనం, దిష్టికుంభం జరపనున్నారు. 11:55 గంటలకు ఆలయ ఉద్ఘాటన తర్వాత ప్రథమ ఆరాధన, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణం, ఆచార్య రుత్విక్ సన్మానం, మహాదాశీర్వచనం, కార్యక్రమ పరిసమాప్తి జరిపి ఉద్ఘాటన పర్వాలను ముగించనున్నారు. కాగా, సుదర్శన యాగం నిర్వహించనున్న నేపథ్యంలో బాలాలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. యాగ శాలల నిర్మాణం చేపట్టారు.