వీధి వ్యాపారులకు లోన్లు ఇస్తలే 

వీధి వ్యాపారులకు లోన్లు ఇస్తలే 

గ్రేటర్​లో లక్షా 62 వేల మంది ఉన్నట్లు గుర్తించిన బల్దియా
 39 వేల మందికే లోన్లు..జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యం

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్​లో అర్హులైన స్ట్రీట్​ వెండర్స్​కి పీఎం స్వనిధి స్కీమ్​ లోన్లు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎంత మందికైనా లోన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులకు రుణాలు అందడంలో ఆలస్యమవుతోంది. పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని, అధికారులు ప్రాసెస్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే లోన్లు పెండింగ్​లో ఉన్నాయని వీధివ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇదే అంశంపై పోయినేడు ఆగస్టులో సీఎస్​ సోమేశ్​ కుమార్​ పలు ప్రాంతాల్లో పర్యటించి వీధి వ్యాపారులతో మాట్లాడారు. అదే టైమ్​లో చాలా మంది అప్లికేషన్లు తీసుకున్నా ఇప్పటికీ రుణాలు అంద లేదు. కొద్ది మందికి రుణాల మంజూరీలో కూడా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చాలా డివిజన్లలో 200 నుంచి 500 వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. సిటీలో 2 లక్షలకు పైగా వీధివ్యాపారులు ఉన్నట్లు లెక్కలున్నప్పటికీ వాళ్లందరికీ లైసెన్స్​ల విషయాన్ని అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు లక్షా 62 వేల మంది వీధి వ్యాపారులను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించగా వారిలో కేవలం  39 వేల మందికి మాత్రమే లోన్లు అందాయి.
ఏడాదిలో 25 శాతం మందికే
పోయినేడు జులైలో పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి(పీఎం స్వనిధి) స్కీమ్ ప్రారంభమైంది. ఇప్పటికి ఏడాది పూర్తవుతున్నప్పటికీ గ్రేటర్​ హైదరాబాద్​లో మాత్రం 25 శాతం మంది లబ్ధిదారులకు మాత్రమే లోన్లు అందాయి. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఈ స్కీమ్​పై పెద్దగా ఇంట్రెస్ట్​ పెట్టకపోవడంతోనే వీధి వ్యాపారులకు లోన్లు అందట్లేదు. లోన్లు ఇవ్వాలంటూ కొందరు ఆఫసీర్ల చుట్టూ తిరుగుతున్నా ఇచ్చేందుకు అధికారులు ముందుకు రావట్లేదు. స్ట్రీట్​వెండర్లకు సంబంధిత డాక్యుమెంట్లను జీహెచ్ఎంసీ ఆఫీసర్లు బ్యాంకులో అందజేస్తే లబ్ధిదారులకు లోన్లు అందుతాయి. కానీ ఆ పని చేసేందుకు కూడా టైమ్​ లేదంటూ దాటవేస్తున్నారు. కరోనా, లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఎంతోమంది స్ట్రీట్​వెండర్లుగా పనిచేస్తున్నారు. అలాంటి ఎంతోమందికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు అధికారులు ముందుకురావట్లేదు. 
కొత్త అప్లికేషన్లు మూలకే
పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు 7 శాతం వడ్డీతో రూ. 10వేల చొప్పున రుణం లభిస్తుంది. ఈ రుణం పొందేందుకు జీహెచ్ఎంసీ జారీచేసిన వీధి వ్యాపారుల గుర్తింపు కార్డుతో పాటు ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. జీహెచ్​ఎంసీ అధికారులు మాత్రం వీధి వ్యాపారుల సర్వే, గుర్తింపు కార్డుల జారీ, రుణ మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని చెప్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా 5 వేల మందికి మాత్రమే లోన్లు అందించారు. అది కూడా అంతకు ముందు శాంక్షన్​ అయినోళ్లకు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది అప్లికేషన్ పెట్టుకున్నవాళ్ల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా తమకు మంజూరు చేయాలని లోన్లు రాని ఎంతో మంది స్ట్రీట్​ వెండర్లు కోరుతున్నారు.
పదేండ్ల నుంచి పండ్లు అమ్ముతున్న
పదేండ్ల నుంచి మాసబ్​ ట్యాంక్​లో పండ్లు అమ్ముతున్న. స్వనిధి కింద పది వేలిస్తమని చెప్పిన్రు. నిరుడు దరఖాస్తులు తీస్కపోయిన్రు. ఇప్పటిదాకా రుణం రాలేదు.  - భాగ్యమ్మ, స్ట్రీట్ వెండర్​ 
6 నెలల కింద వచ్చిపోయిన్రు
కరోనా కంటే ముందు హోటల్లో చెఫ్​గా పనిచేసిన. కరోనాతో హోటల్​ మూతపడింది. అప్పట్నుంచి రోడ్డుపక్కన అల్లం, ఎల్లిగడ్డ అమ్ముకుంటున్న. 6 నెలల కింద జీహెచ్ఎంసీ వాళ్లు వచ్చి రూ.10 వేలు లోన్ వస్తదని చెప్పి పోయిన్రు. ఇప్పటికీ ఎవరూ రాలేదు. - బాల్​ రెడ్డి, వీధివ్యాపారి, గుడిమల్కాపూర్​
రుణాలు వస్తయో లేదో
మహావీర్ హాస్పిటల్ పక్కన  పండ్లు అమ్ముకుంట. రెండు నెలల కింద జీహెచ్ఎంసీ ఆఫీసర్లు ఆధార్ కార్డు, వోటర్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ తీసుకున్నరు. ఇప్పటికి లోన్​ రాలేదు.  వస్తదో లేదో కూడా తెలుస్తలేదు. - భారతి, వీధి వ్యాపారి