ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్​ హ్యాట్రిక్​ ఖాయం: హరీశ్

ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్​ హ్యాట్రిక్​ ఖాయం: హరీశ్
  • బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్​నేత నగేశ్​ముదిరాజ్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యమ ద్రోహులతో కాంగ్రెస్​ చేతులు కలిపిందని, 2018లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ ఇప్పుడు పరోక్షంగా కలిసిపోయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైఎస్​షర్మిల తెలంగాణకు వ్యతిరేకంగా ఎలా పని చేసిందో అందరికీ తెలుసని, అలాంటి పార్టీతో కాంగ్రెస్​కలిసి పని చేస్తుందన్నారు. ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకెళ్లిన రేవంత్​రెడ్డిని మించిన తెలంగాణ ద్రోహి ఇంకొకరు లేరన్నారు. సోమవారం తెలంగాణ భవన్​లో పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్​ముదిరాజ్​బీఆర్ఎస్​లో చేరారు. మంత్రి హరీశ్​రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్​పార్టీ బీసీలను చిన్నచూపు చూస్తున్నదన్నారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమ ద్రోహులతో చేతులు కలిపిన కాంగ్రెస్​కు ఓటేందుకు వెయ్యాలో చెప్పాలన్నారు. డీకే శివకుమార్​ను ప్రచారానికి తెచ్చి కాంగ్రెస్​పార్టీ సెల్ఫ్​గోల్​కొట్టుకుందని, హిట్​వికెట్​అయ్యిందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్​పాలనలో రాష్ట్రమంతా పచ్చగా మారిం దని, పదేళ్లుగా కరువు లేదు.. కర్ఫ్యూ లేదు.. ఇంత మంచిగా ఉన్నప్పుడు మనం ఎందుకు రిస్క్​తీసుకోవాలని హరీశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్​ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగిందని మనం జాలి చూపితే రాష్ట్రం మళ్లీ ఆగమైపోతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎంత గోబెల్స్​ప్రచారం చేసినా బీఆర్ఎస్​గెలవడం, కేసీఆర్​ సీఎంగా హ్యాట్రిక్​కొట్టడం ఖాయమన్నారు. ముదిరాజ్​ల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, రానున్న రోజుల్లో రాజకీయ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నగేశ్​ ముదిరాజ్​ మాట్లాడుతూ.. తెలంగాణను వ్యతిరేకించిన సమైక్యవాదులతో పొత్తు వద్దని చెప్పినందుకే తనకు టికెట్​ఇవ్వలేదన్నారు. పీసీసీ మొత్తం టీడీపీ మయం చేశారని, టికెట్లను కూడా వాళ్లే డిసైడ్​చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్​లో బీసీ నాయకులకు తీవ్ర అవమానం జరుగుతోందని, వాళ్లు తలవంచుకొని బానిసల్లాగా పని చేస్తున్నారని అన్నారు.