బుక్​ఫెయిర్​కు సందర్శకుల రద్దీ

బుక్​ఫెయిర్​కు సందర్శకుల రద్దీ

ముషీరాబాద్, వెలుగు: టెక్నాలజీ పరంగా సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా, చదువులు సైతం డిజిటల్​గా మారినా.. పుస్తకాలకు ఉండే ప్రాధాన్యతే వేరు. కొత్త మాధ్యమాలు ఎన్ని వచ్చినా జనాల్లో పుస్తకాలు చదవడంపై  ఇంట్రెస్ట్ ​తగ్గలేదు. యువత సైతం ఆసక్తి చూపుతోంది. ఆలోచన రేకెత్తించే మంచి సాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే జీవిత చరిత్ర ఇతర అంశాలకు చెందిన పుస్తకాలకు రీడర్స్​అతుక్కుపోతున్నారు. 

మరిన్ని కలెక్ట్​ చేసుకునేందుకు ఉత్సాహం​చూపిస్తున్నారు. అలాంటి వారి కోసం బుక్​ఫెయిర్ ​రానే వచ్చింది. మూడ్రోజుల రోజుల కిందట ఎన్టీఆర్ స్టేడియంలో మొదలైన 32వ హైదరాబాద్ నేషనల్ బుక్​ఫెయిర్​కు సందర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శనివారం వీకెండ్ కావడంతో మరింత రద్దీ కనిపించింది.

340 స్టాల్స్​తో ఏర్పాటు

దేశంలోనే రెండో అతిపెద్ద పుస్తక ప్రదర్శన అయిన హైదరాబాద్ బుక్ ఫెయిర్  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ ​బెంగాల్ తదితర ​రాష్ట్రాలకు చెందిన 340 స్టాల్స్​తో ఈ నెల 22న ఏర్పాటైంది. జనవరి 1 వరకు కొనసాగనుంది. సాహిత్యం, ఆధ్యాత్మికం, నవలలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, వ్యక్తిత్వ వికాసం, న్యాయ, వైద్య శాస్త్ర, పోటీ పరీక్షలతో పాటు ఇతర  పుస్తకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలకు ఉపయోగపడేలా మైండ్ డెవలప్​మెంట్​కిట్స్, రోబోటిక్స్, సైన్స్, పజిల్స్, కార్టూన్ పుస్తకాలు సైతం ఈ స్టాల్స్​లో అందుబాటులో ఉన్నాయి.

10 నుంచి 20 శాతం తగ్గింపు..

బుక్ ఫెయిర్ సందర్భంగా పుస్తకాలపై పబ్లిషర్లు 10 నుంచి 20 శాతం రాయితీ ఇస్తున్నారు. తెలుగు అకాడమీ సైతం ధరను తగ్గిస్తోంది. మరికొన్ని పుస్తకాలపై 10 నుండి 50 శాతం వరకు తగ్గిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30  వరకు ఈ ఫెయిర్ కొనసాగుతుంది. శని, ఆదివా
రాలు, ఇతర సెలవు రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. స్టూడెంట్లు ఐడీ కార్డు చూపిస్తే వారికి ఉచిత ప్రవేశం ఉంటుంది. కాగా తెలంగాణ ఒగ్గు కళారూపానికి వన్నెతెచ్చిన ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు పేరును ఈ బుక్ ఫెయిర్​కు పెట్టడం విశేషం.

ఏర్పాట్లు బాగున్నాయి

30 ఏండ్లుగా ఈ బుక్ ఫెయిర్​కు వస్తున్నాం. ఈ సారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పుస్తకాలు కొనే  వారి సంఖ్య కూడా గతంతో పోలిస్తే పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ బుక్ ఫెయిర్ ద్వారా వారికి బుక్స్​ను నేరుగా పరిచయం చేసే అవకాశం ఉంది. - శివకుమార్, పబ్లిషర్స్

అన్ని రకాల బుక్స్​ దొరుకుతున్నయ్

యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా. ఏదైనా అవసరమైన పుస్తకం కోసం చాలా షాపులు తిరగాల్సి వస్తోంది. ఇక్కడైతే అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి. ఏ పుస్తకంలో మెటీరియల్ ఎక్కువగా ఉందో, ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలిసిపోతుంది. అంతేకాకుండా అన్ని రకాల పబ్లిషర్స్ ఇక్కడ ఉండటంతో పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్ ఈజీగా దొరుకుతోంది. - శివ, ఆర్టీసీ క్రాస్​రోడ్స్, స్టూడెంట్ 

డిస్కౌంట్​ ఇస్తున్నరు

వివిధ పరీక్ష పోటీలకు ప్రిపేర్ అయ్యేవారికి ఈ బుక్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుంది.  బయటి షాప్​ల కన్నా ఇక్కడ ఎక్కువ డిస్కౌంట్  ఉంటుంది. స్టూడెంట్లు, నిరుద్యోగులకు చక్కటి అవకాశం ఈ బుక్ ఫెయిర్. - కళ్యాణి, గాంధీనగర్, స్టూడెంట్