మందులు లేవంటూ తిప్పిపంపిస్తున్నరు

మందులు లేవంటూ తిప్పిపంపిస్తున్నరు

రెండు నెలలుగా ఇదే పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్లలో మందులు దొరుకుతలేవు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. బీపీ, షుగర్, థైరాయిడ్, న్యూరో తదితర సమస్యలతో డాక్టర్లను సంప్రదించి ప్రిస్కిప్షన్​తో మందుల కోసం వస్తున్న పేషెంట్లను వెల్ నెస్ సెంటర్లు మందులు లేవంటూ తిప్పిపంపిస్తున్నాయి. డాక్టర్లు రాసే మందుల్లో సగం మెడిసిన్ కూడా దొరుకుతలేవని, ఒకటి ఉంటే మరొకటి అందుబాటులో ఉండట్లేదని పేషెంట్లు వాపోతున్నారు. కొన్ని ఖరీదైన మందులైతే అసలే ఉండట్లేదంటున్నారు.

మందులు లేక ఓపీలు తగ్గినయ్

రాష్ట్ర వ్యాప్తంగా 12 వెల్​నెస్ సెంటర్లు ఉండగా, గ్రేటర్ పరిధిలో ఖైరతాబాద్, వనస్థలిపురం, కూకట్​పల్లిలో ఒక్కొక్కటి ఉన్నాయి. ఖైరతాబాద్​కు రోజూ 400 మంది, కూకట్​పల్లికి 200 నుంచి 250 మంది, వనస్థలిపురానికి 300 నుంచి 400 మంది పేషెంట్లు వస్తుంటారు. హెడ్ సెంటర్ గా కొనసాగుతున్న  ఖైరతాబాద్  సెంటర్ ఓపీకి 800 మంది  కూడా వచ్చిన రోజులున్నాయి. ప్రస్తుతం మెడిసిన్ అందుబాటులో ఉండకపోవడంతో పేషెంట్ల సంఖ్య సగానికిపైగా తగ్గింది. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు దాదాపు 14లక్షల మంది ఉన్నారు. 

షుగర్, బీపీ పేషెంట్లే ఎక్కువ

వెల్​నెస్ సెంటర్లకు వచ్చేవాళ్లలో బీపీ, షుగర్, థైరాయిడ్, న్యూరో బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. షుగర్ బాధితుల్లో 60 శాతం మందికి ఇన్సులిన్ అవసరం ఉంటుంది. దీని ధర మార్కెట్​లో రూ.200 నుంచి రూ.2వేలకు పైనే ఉంది. ప్రస్తుతం వెల్ నెస్ సెంటర్లలో ఆగస్టు నుంచి ఇన్సులిన్ అందుబాటులో ఉండట్లేదు. దాంతో పేషెంట్లు అన్ని వెల్​నెస్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టినా లాభం లేకుండా పోతోంది. బీపీ, న్యూరో మెడిసిన్  కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బయటి హాస్పిటళ్లలో రాసిన మందుల్లో 80 శాతం మెడిసిన్ వెల్ నెస్​ సెంటర్లలో దొరుకుతలేవు. దీంతో నెలకు రూ.3 వేల నుంచి రూ.6 వేల దాకా ఖర్చు పెట్టి బయట కొనుక్కుంటున్నామని పలువురు పేషెంట్లు వాపోయారు. కాగా, 2016 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 17న ఖైరతాబాద్ లో మొదటి వెల్ నెస్​ సెంటర్ ని ఏర్పాటు చేసిన సర్కారు.. ఆపై ఒక్కొక్కటిగా మొత్తం 12 సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. కానీ, వాటి పనితీరుపై మాత్రం సమీక్షించడం లేదు. ప్రస్తుతం ఫార్మా కంపెనీలతో  అగ్రిమెంట్ విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంతోనే వెల్​నెస్ సెంటర్లలో మెడిసిన్ లేకుండాపోయాయని తెలిసింది.

మరో 20రోజుల్లో వస్తయ్

వెల్​నెస్​ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బంది సరిపడా ఉన్నప్పటికీ మందులు మాత్రం అందుబాటులో ఉండట్లేదు. అన్ని రకాల మందులు ఆర్డర్​ చేశామని, మరో 20 రోజుల్లో మెడిసిన్స్ వస్తాయని అధికారులు, సిబ్బంది చెప్తున్నారు. పేషెంట్లు​ ఆందోళన పడొద్దని అంటున్నారు.

అవసరమున్నవి ఉండట్లే...

వెల్ నెస్ సెంటర్లలో అవసరమున్న మెడిసిన్  ఉండట్లేదు. సెలవులు పెట్టి మరీ దూరం నుంచి వస్తే మందులు లేవని వాపస్ పంపుతున్నరు. మా బాబుకి ఫిట్స్​​ప్రాబ్లమ్ ఉంది. అందుకు మందులు ఖైరతాబాద్ సెంటర్ లో ఆరునెలల నుంచి దొరకట్లే. ఉన్న వాటిలో కూడా నిమ్స్ లో డాక్టర్​ రాసినవి కాకుండా వేరేవి ఇస్తున్నారు. ఇక్కడ లేని మెడిసిన్ ప్రతి నెలా బయట కొంటున్న. రూ.2వేలు అయితున్నయ్. 

- కరుణాకర్, ఉద్యోగి భర్త