మీటర్లు లేని ఆటోలకు రిజిస్ట్రేషన్! త్వరలో పర్మిట్ల జారీకి సన్నాహాలు

మీటర్లు లేని ఆటోలకు రిజిస్ట్రేషన్!  త్వరలో పర్మిట్ల జారీకి సన్నాహాలు
  • రూల్స్ బ్రేక్​ చేస్తున్న ఆర్టీఏ ఆఫీసర్లు  
  • ఫిట్​నెస్​కు వచ్చినప్పుడు చేస్తామన్న జేటీసీ 

హైదరాబాద్​సిటీ, వెలుగు:గ్రేటర్​ పరిధిలో ఆర్టీఏ అధికారులు ఆటో పర్మిట్లు ఇవ్వడం, రిజిస్ట్రేషన్లు చేస్తున్న తీరుపై పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి. కొంతకాలం కింద ఔటర్​పరిధిలో కొత్తగా 45 వేల ఆటో పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, అమ్మకాలు మొదలై రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. 

అయితే, రిజిస్ట్రేషన్​లు, పర్మిట్ల జారీ విషయంలో అధికారులు రూల్స్​పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మీటర్లు లేని ఆటోలకు పర్మిట్లు ఇవ్వొద్దని ఉమ్మడి రాష్ట్రంలోనే 2006 ,అక్టోబరు 31న జీవో 213 జారీ చేశారు. తెలంగాణ మోటార్​ వెహికల్ ​యాక్ట్​ -89 కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 

ఈ నిబంధనల ప్రకారం కొత్త ఆటోలను రిజిస్ట్రేషన్​ చేయాలన్నా, పర్మిట్లు జారీ చేయాలన్నా ఆటోలకు తప్పని సరిగా మీటర్​ అమర్చబడి ఉండాలి. అయినా ఈ రూల్స్​ను తుంగలో తొక్కి మీటర్లు లేని ఆటోలను ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

పర్మిట్లు ఇలా ఇవ్వాలి  

10 వేల సీఎన్జీ, మరో 10 వేల ఎల్పీజీ ఆటోలతో పాటు 25వేల ఎలక్ట్రిక్​ఆటోలను ఓఆర్ఆర్​పరిధిలో నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ ఆటోలు రోడ్లపైకి రావాలంటే తెలంగాణ మోటార్​వెహికల్​యాక్ట్​-89 ప్రకారం ముందుగా ఆటోలను అమ్మేప్పుడే తయారీ సంస్థలు మీటర్లను బిగించి ఇవ్వాలి. తర్వాత ఆర్టీఏ వద్ద రిజిస్ట్రేషన్​ చేసుకుంటే నంబర్​ఇస్తారు. తర్వాత తూనికలు కొలతల శాఖ అధికారుల నుంచి మీటర్​ స్టాంపింగ్​ చేయించుకోవాలి. తర్వాత ఆటోను మళ్లీ ఆర్టీఏ ఆఫీసర్ల వద్దకు తీసుకువెళ్తే ఫిట్​నెస్​ పరిశీలించి రెండు నుంచి ఐదేండ్ల వరకు పర్మిట్లను జారీ చేస్తారు. 

జరుగుతోంది ఇది..

ప్రస్తుతం జరుగుతున్న తంతులో రూల్స్​ను ఎవరూ పాటించడం లేదు. ఆటోలను అమ్ముతున్న సంస్థలు ఆటోలకు మీటర్లు బిగించి ఇవ్వడం లేదు. మీటర్లు లేకుండా వెళ్లినా ఆర్టీఏ అధికారులు కావాల్సినంత ఫీజు తీసుకుని రిజిస్ట్రేషన్​చేస్తున్నారన్న విమర్శలున్నాయి. త్వరలోనే ఈ ఆటోలకు పర్మిట్లను కూడా ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. 

రూల్స్​ ఎందుకు పాటిస్తలేరు సారూ..

రూల్స్​ఎందుకు పాటించడం లేదో అధికారులు చెప్పడం లేదని భారతీయ ప్రైవేట్​ట్రాన్స్​పోర్ట్​మజ్జూర్​మహా సంఘ్​ఆల్​ఇండియా ప్రధాన కార్యదర్శి రవిశంకర్​ అల్లూరి అంటున్నారు. వచ్చిన ఆటోలకు మీటర్​ ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్​ చేస్తున్నారని, రిజిస్ట్రేషన్​ చేశాక పర్మిట్లను కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. ఆటోలను అమ్మే టైంలో ఆయా కంపెనీలు మీటర్ తో కలిపే బిల్లు వసూలు చేస్తున్నాయని, మీటర్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.