ఆందోళన బాట పట్టిన మిడ్ డే మీల్స్ కార్మికులు

ఆందోళన బాట పట్టిన మిడ్ డే మీల్స్ కార్మికులు
  • ఇంటి నుంచి లంచ్​ తెచ్చుకుంటున్న విద్యార్థులు
  • ఏడు నెలలుగా బిల్లులు బకాయి

ఆదిలాబాద్, వెలుగు: మధ్యాహ్న భోజనం పెట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూరగాయలు, గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రైమరీ స్కూల్​ఒక్కో విద్యార్థికి రూ.4.75 , ప్రాథమికోన్నత, హైస్కూల్​విద్యార్థికి రూ. 7.95 చొప్పున బిల్లులు ఇస్తోంది. అయితే పెరిగిన ధరలతో చూస్తే కార్మికులకు గిట్టుబాటు కావడం లేదు. మార్కెట్లో దాదాపు అన్ని కూరగాయలు రూ. 50 కేజీ పలుకుతున్నాయి. నూనెలు, పప్పుల ధరలు పెరిగాయి. అయినా చాలామంది వడ్డీలకు అప్పు తెచ్చి భోజనం పెడుతున్నారు. అయితే ప్రభుత్వమే వంట గ్యాస్, కోడి గుడ్లు, సరఫరా చేయాలని, మెనూ చార్జీలు పెంచాలని కార్మికులు కోరుతున్నారు.పెంచిన వేతనం అమలు కాలె..

సీఎం కేసీఆర్​గత మార్చిలో అసెంబ్లీ సాక్షిగా మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు. కానీ... ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. ఏప్రిల్ నుంచి పెంచిన వేతనాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం జీతాలు పెంచినట్లు ప్రచారానికే పరిమితమయ్యిందనే ఆరోపణలు ఉన్నాయి. అసలు లేదు.. వడ్డీ లేదన్నట్లుగా గతంలో ఇచ్చే రూ. వెయ్యి ఇస్తలేరని, పెంచినది ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. వీరికి 2010 నుంచి నెలకు రూ.వెయ్యి గౌరవవేతనాన్ని ఇస్తుండగా, కేసీఆర్ హామీతో అదనంగా రూ. 2 వేలు గౌరవవేతనంగా లభిస్తుందని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలింది. 

ఆగిన భోజనం.. ఇంటి నుంచి టిఫిన్లు..
మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. కొన్ని జిల్లాలో కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపట్టడంతో సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనం ఆగింది. 10‌‌‌‌ రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్​లో  కార్మికులు నిరసన వ్యక్తం చేస్తుండడంతో విద్యార్థులు ఇంటి నుంచి లంచ్​తెచ్చుకుంటున్నారు. కొందరు ఇండ్లకు వెళ్లి తినివస్తున్నారు. కొన్ని స్కూళ్లలో టీచర్లు వంటచేసి పెడుతున్నారు.

రూ. ఆరు కోట్లు పెండింగ్ లో ఉన్నాయి..
జిల్లా వ్యాప్తంగా కార్మికుల జీతాలతో పాటు, భోజన బిల్లులు దాదాపు రూ. 6 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే దీనిపై మీటింగ్ నిర్వహించి సమస్య పరిష్కరానికి కృషి చేస్తాం. 
–ప్రణీత, డీఈవో, ఆదిలాబాద్