హైదరాబాద్: ప్రపంచ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోన్న మంకీ పాక్స్‌పై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్&ఫెల్ఫేర్ తెలంగాణ డా.రవీందర్ నాయక్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఒక్క మంకీ పాక్స్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న డబ్ల్యూహెచ్‌వో అలర్ట్‌గా ఉన్నామన్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మంకీ పాక్స్ కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం రవీంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణం మార్పు వల్ల దోమలతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు. వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇప్పటివరకు తెలంగాణలో డెంగ్యూ వ్యాధి కేసులు దాదాపు 5వేల వరకు ఉన్నాయని అందులో కొన్ని హై రిస్క్ కేసులను గుర్తించామని తెలిపారు. అయితే, డెంగ్యూ వల్ల ఒక్క డెత్ కూడా నమోదు కాలేదని వెల్లడించారు. ప్రతి సంవత్సరం వచ్చే వ్యాధులు కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతోందన్నారు. రాష్టంలో ఇంటి ఇంటికి సర్వే చేస్తున్నామని, గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 42 ల్యాబ్స్ ఉన్నాయని, మొత్తం 33 జిల్లాలో అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలని భయబ్రాంతులకు గురి చెయ్యొద్దని సూచించారు.