- పనులన్నీ ఎక్కడివక్కడే
- అధ్వాన్నంగా మారిన ప్రాజెక్ట్ కాలువలు
- చివరి ఆయకట్టు రైతులకు మళ్ళీ కష్టకాలం
వనపర్తి, వెలుగు : జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌ల కాలువలు ఏండ్లు గడుస్తున్నా కనీస రిపేర్లకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నా.. కాలువలు మంచిగలేక పంటలకు నీరు అందుతలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు తో పాటు కల్వకూర్తి, భీమా లిఫ్ట్ ల ద్వారా జిల్లా లో సుమారు 2.5లక్షల ఎకరాలకు నీరు అందుతోంది. వానాకాలం రానున్న టైంలో కాలువల రిపేర్లకు కూడా నోచుకోవడం లేదు. ముండ్ల కంపలు, చెత్తా చెదారంతో మూసుకు పోయాయి. కిందటి యాసంగి పంటలు పూర్తయిన వెంటనే కాలువల రిపేర్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇరిగేషన్ అధికారుల సమీక్ష సమావేశంలో సూచించారు. అత్యవసర నిధుల కింద ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ పథకంలో అధికారులు 55 రకాల పనులను గుర్తించి, రూ.3.28 కోట్లు కేటాయించారు. కిందటి ఏడాది నవంబర్ లో టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేశారు. అయినా చాలా చోట్ల పనులు మొదలు పెట్టలేదు. టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్లు బిల్లులు రావని పనులు చేస్తలేమని అంటున్నారు. అత్యవసర పనులైన కాలువల లైనింగ్, బ్యాంకింగ్ రిపేర్లు, మేజర్, మైనర్, సబ్ మైనర్ కాల్వల రిపేర్లు చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్టుల వారీగా ఇలా...
డివిజన్ -5లోని రాజీవ్ భీమా పథకం కింద 17 పనులకు రూ. 73 లక్షలు కేటాయించారు. డివిజన్ -6లోని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని సబ్ డివిజన్-1 నందిమల్ల, సబ్ డివిజన్- 4 రామన్ పాడు, సబ్ డివిజన్-3 గోపల్ దీన్నే జలాశయం, సబ్ డివిజన్-2 కింద డీ-23 నుంచి డీ-40 వరకు, బ్రాంచ్ కెనాల్ కింద 24 పనులకు రూ.84 లక్షలు కేటాయించారు.డివిజన్-7 కెఎల్ఐ పథకంలో 14 పనులకు రూ.1.71 కోట్లు కేటాయించారు. రాజీవ్ భీమా కింద 5 మాత్రమే పూర్తి చేశారు. 8 పనులు అరకొరగా నడుస్తుండగా 4 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. డివిజన్-6లో జూరాల ప్రాజెక్టు 6 పనులు పూర్తి కాగా.. 11 పనులు ప్రారంభంయయ్యాయి. ఇంకా 7 పనులను ఇంకా మొదలు పెట్టలేదు. డివిజన్ -7 కెఎల్ఐ ప్రాజక్టులో 7 పనులు పూర్తి కాగా... మరో 5 పనులు ప్రారంభం అయ్యాయి. రెండు పనులను గుత్తేదార్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
కాంట్రాక్టర్లు ఎవరూ రావడం లేదు
జిల్లాలోని రాజీవ్ భీమా, జూరాల ప్రాజెక్టు పరిధిలోని ఎడమ కాలువ, కెఎల్ఐ ప్రాజెక్టుల పరిధిలో ఓ అండ్ ఏ కింద చేప్పట్టిన పనులను జులై 15 కల్లా పూర్తి చేస్తాం. పనులకు కొందరు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకొని ముందుకు రావడం లేదు. వారికి నోటీసులు ఇస్తాం. ముందుకు రాకపోతే బ్లాక్ లిస్ట్ లో చేరుస్తాం. ఎలాగైనా పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటాం.
- సత్యశీలా రెడ్డి, ఎస్ ఈ, నీటిపారుదల శాఖ
చివరి ఆయకట్టు కు కష్టాలే...
జూరాల ప్రాజెక్టు ఎడమ కాలవ కు రిపేర్లు చేయటం లేదు.ఇప్పటికే కాలువ పాడైపోయింది. తక్కువ నీరు వదిలితే చివరి ఆయకట్టుకు చేరవు. ఎక్కువ నీరు వదిలితే కాలువలు తెగిపోయి పంటలు మునిగి పోతున్నాయి.
- రవీందర్, రైతు, గోవర్ధన గిరి
