ప్రజలెవరూ అదనపు చార్జీలు చెల్లించొద్దు : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ప్రజలెవరూ అదనపు చార్జీలు చెల్లించొద్దు : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

జగిత్యాల, వెలుగు :  కేవలం ఉత్తర తెలంగాణ ప్రజలకే ఏసీడీ చార్జీల భారం ఎందుకు మోపుతున్నారో సీఎం సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. విద్యుత్​సమస్యలపై కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాలలోని ఇందిరాభవన్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా విద్యుత్ ప్రగతి భవన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలెవరూ ఏసీడీ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రెండు పవర్ కంపెనీలుంటే అందులో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీపై ఏసీడీ భారం లేదని, నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీపైనే భారం వేస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజమాబాద్, అదిలాబాద్ జిల్లాలో మాత్రమే భారం వేస్తున్నారన్నారు. అనంతరం విద్యుత్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఏసీడీ చార్జీలతో పాటు విద్యుత్ సరఫరా సమయం తెలపాలని చెప్పగా ఎస్ఈ సత్య నారాయణ జీవన్ రెడ్డితో మాట్లాడారు. చార్జీల ఆంశం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం తో కాంగ్రెస్ శ్రేణులు వెనుదిరిగారు.   

చొప్పదండి: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, కోతలతోపాటు ఏసీడీ చార్జీల పేరిట ప్రభుత్వం భారం మోపడాన్ని నిరసిస్తూ చొప్పదండి సబ్ స్టేషన్​ ముందు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి మేడిపల్లి సత్యం మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంట విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు. పొలాల దగ్గర రైతులు కరెంటు కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్​రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.