చంద్రుడిపై రియల్ ఎస్టేట్ .. బోగస్ దందా.. అన్నీ ఉత్తుత్తి కొనుగోళ్లే

చంద్రుడిపై రియల్ ఎస్టేట్ .. బోగస్ దందా..  అన్నీ ఉత్తుత్తి కొనుగోళ్లే
  • జాబిల్లిపై ఏ వ్యక్తికీ, ఏ దేశానికీ హక్కుల్లేవ్..  అన్నీ ఉత్తుత్తి కొనుగోళ్లే

న్యూఢిల్లీ: చంద్రయాన్ మిషన్ సక్సెస్ కాంగనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనాల ఫోకస్ చంద్రుడిపై పడింది. ఈ మధ్యనే తెలంగాణ ఎన్ఆర్ఐ మహిళ ఒకరు తన తల్లికి చంద్రుడి మీద ప్లాట్ ను కూడా కొనిచ్చి వార్తల్లోకి వచ్చింది. ఇంతకుముందు బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, సుషాంత్ సింగ్ రాజ్​పుత్ వంటి వాళ్లూ చంద్రుడిపై ప్లాట్లు కొన్నారు. జస్ట్ రూ.3 వేలకే ఎకరా అంటూ కొన్ని ‘లూనార్ రియల్ ఎస్టేట్’ కంపెనీలు ఊరిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మూన్​పై ప్లాట్లు కొంటూ డాక్యుమెంట్లు చూపెడుతూ సంబురపడుతున్నారు. ఫ్యూచర్​లో తమ ప్లాట్లకు కంచెలు వేసుకుంటామని, ఇండ్లు కట్టుకుంటామని.. మైనింగ్ కంపెనీలకు లీజ్​కు ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంతకూ చంద్రుడిపై మనం ప్లాట్లు కొనొచ్చా? వాటికి చట్టబద్ధత ఉంటుందా? అంటే.. ముమ్మాటికీ నో అనే చెప్పాలి. ఈ దందా చేస్తున్న కంపెనీలు చెప్తున్న వివరాలు, అంతర్జాతీయ చట్టాలను పరిశీలిస్తే.. మూన్ పై రియల్ ఎస్టేట్ అంతా ఒక బోగస్ దందా అన్నది తేలిపోతోంది.  
 
చందమామ ఎవరి సొత్తూ కాదు

పొరుగు దేశాలతో తరచూ కయ్యానికి కాలుదువ్వే చైనా తప్ప.. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా చందమామ తమ సొంతమని ప్రకటించుకోలేదు. ఒక్క డ్రాగన్ కంట్రీ మాత్రమే తమ దేశ భూభాగంపై చంద్రుడి వరకూ ఉన్న స్పేస్ అంతా తమదేనని, మొత్తం చంద్రుడు కూడా తమ సొంతమని ప్రకటించుకున్నది. అయితే సోవియెట్ యూనియన్, అమెరికా, బ్రిటన్ 1967 జనవరి 27న ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ని కుదుర్చుకున్నాయి. ఆగస్టు 2023 నాటికి ఈ ఒప్పందంపై ఇండియా సహా 114 దేశాలు సంతకాలు చేశాయి. దీని ప్రకారం.. ఔటర్ స్పేస్​పై గానీ, చంద్రుడు సహా ఇతర ఖగోళ వస్తువులపై గానీ ఏ ఒక్క దేశానికీ హక్కులు ఉండవు.

కొంటే ఏమవుతుంది? 

ఏమీ కాదు.. జస్ట్ పేపర్​పై మాత్రమే మనకు చంద్రుడిపై జాగ ఉంటుంది. మూన్ ప్లాట్లను అమ్మే కంపెనీలు ప్లాట్ల రిజిస్ట్రేషన్​కు సంబంధించిన డాక్యుమెంట్లను, మ్యాపులను అందంగా తీర్చిదిద్ది కస్టమర్లకు ఇస్తున్నాయి. ఈ ప్లాట్లను ఇతరులకు గిఫ్ట్ గా ఇవ్వొచ్చని, ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చని కూడా చెప్తున్నాయి. చంద్రుడిపై 100 కోట్ల ఎకరాలు అమ్మకానికి పెట్టామని ఊరిస్తున్నాయి. కానీ ఈ డాక్యుమెంట్లకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. ఎందుకంటే, ఏదైనా ఒక జాగను మనం కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే.. ముందుగా అది ఒక సార్వభౌమ దేశ అధీనంలో ఉండాలి. ఆ భూమిపై హక్కుల మార్పిడి, లావాదేవీలు నిర్వహించేందుకు ఆ దేశంలో సరైన చట్టాలు ఉండాలి. కానీ చంద్రుడి భూమిపై ఏ దేశానికి కూడా సార్వభౌమ అధికారం లేదు. చట్టాలు అసలే లేవు. అలాంటప్పుడు ఆ భూమిని కొనడం, అమ్మడం అసాధ్యం. మూన్ ప్లాట్లను కొంటే ఆ ఫొటోలను, డాక్యుమెంట్లను ఫ్రేం కట్టించుకుని గోడకు తగిలించుకుని సంబురపడేందుకు మాత్రం పనికొస్తాయని చెప్తున్నారు.

కంపెనీలు ఏం చెప్తున్నయ్? 

చంద్రుడిపై ప్లాట్లు అమ్ముతున్న లూనార్ రిజిస్ట్రీ, లూనార్ ఎంబసీ వంటి కంపెనీలు పదుల కొద్దీ ఉన్నాయి. ఏరియాను బట్టి ఎకరాకు కనీసం రూ.3 వేలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి. ఈ కంపెనీలేవీ చట్టబద్ధమైనవి కావు. తమకు ఏ దేశ ప్రభుత్వంతో లేదా కంపెనీలతో సంబంధం లేదని తమ వెబ్ సైట్లలో పేర్కొన్నాయి. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే అధీకృత ఎన్జీఓ ఆధ్వర్యంలో చంద్రుడిపై రీసెర్చ్,  మానవ ఆవాసాల ఏర్పాటుకు ప్రైవేట్ ఫండింగ్ కోసమే ప్లాట్లు అమ్ముతున్నామని లూనార్ రిజిస్ట్రీ కంపెనీ చెప్తోంది.