
తిరుమలలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శ్రీవారి లడ్డూలకు ప్లాస్టిక్ కవర్లను ఇవ్వకూడదని ఆదేశాలిచ్చింది. దీంతో లడ్డూ కౌంటర్ల వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్ల అమ్మకం నిలిపేశారు. లడ్డూలకు కాగితం, నార సంచులు, పేపర్ బాక్సుల్ని అందుబాటులోకి తెచ్చారు అధికారులు. ఒకటి, రెండు, నాలుగు లడ్డూలు పట్టే అట్ట బాక్సులు, ఐదు, పది, పదిహేను, ఇరవై ఐదు లడ్డూలు పట్టే సంచులను లడ్డూ కాంప్లెక్స్ దగ్గర అమ్ముతోంది టీటీడీ. ఆ లడ్డూ సంచులు, బాక్సుల ధరలతో బోర్డులు పెట్టింది.
సంచుల ధరలివీ:
5 లడ్డూల సంచి రూ.25
10 లడ్డూల సంచి రూ.30
15 లడ్డూల సంచి రూ.35
25 లడ్డూల సంచి రూ.55
అట్ట బాక్సుల ధరలివీ:
1 లడ్డూ బాక్స్ రూ.3
2 లడ్డూల బాక్స్ రూ.5
4 లడ్డూల బాక్స్ రూ.10
భక్తుల స్పందన ఇదీ
ప్లాస్టిక్ కవర్ల నిషేధం మంచిదే అని చాలా మంది భక్తులు అంటున్నారు. అయితే నార సంచుల రేటు ఎక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్లాస్టిక్ కవర్లు మూడు, ఐదు రూపాయల్లోనే వచ్చేవని, ఇప్పుడు కొత్తగా తెచ్చిన సంచుల రేటు చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు శ్రీవారి భక్తులు.
బాక్సుల రేటు ఓకే.. బాగున్నాయంటున్న భక్తులు
తక్కువ లడ్డూలు తీసుకునే భక్తులు మాత్రం టీటీడీ కొత్త నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు లడ్డూల వరకూ తీసుకెళ్లేలా అందుబాటులోకి తెచ్చిన లడ్డూ బాక్సులు బాగున్నాయని చెబుతున్నారు. వాటి రేటు కూడా తక్కువగానే ఉందన్నారు. పైగా గతంలోకవర్లలో లడ్డూలు తీసుకెళ్తే పొడిపొడిగా అయిపోయేవని, ఇప్పుడు బాక్సుల్లో నలగకుండా ఉంటాయని చెబుతున్నారు.