రంగు మారింది అంతేగా.. : ఆరెంజ్ వందే భారత్ రైళ్లపై రాజకీయం ఏముందీ

రంగు మారింది అంతేగా.. : ఆరెంజ్ వందే భారత్ రైళ్లపై రాజకీయం ఏముందీ

ఆరెంజ్ వందే భారత్ రైళ్ల వెనుక వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. నారింజ రంగు వందే భారత్ రైళ్ల వెనుక ఎలాంటి రాజకీ యాలు లేవని.. ఇది 100శాతం  శాస్త్రీయ ఆలోచన అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల జర్నలిస్టులతో జరిగిన ఇంటరాక్షన్‌లో నారింజ రంగులో వందేభారత్ రైళ్లను ప్రారంభించడం వెనుక ఏదైనా రాజకీయం ఉందనే భావనను తోసిపుచ్చారు. రంగుల ఎంపిక శాస్త్రీయ ఆలోచన  అని తెలిపారు. ‘‘మానవ కళ్ళకు పసుపు, నారింజ రెండు రంగులు ఎక్కువగా కనిపిస్తాయి. ఐరోపాలో దాదాపు 80 శాతం రైళ్లలో నారింజ లేదా పసుపు, నారింజ కలయిక ఉంటుంది" అని వైష్ణవ్ చెప్పారు.

వెండి వంటి అనేక ఇతర రంగులు ఉన్నాయి..ఇవి పసుపు, నారింజ వంటి ప్రకాశవంతంగా ఉంటాయి..కానీ కంటికి కనిపించే దృశ్యమానత కోణం నుంచి చూస్తే.. ఈ రెండు రంగులు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి" అని రైల్వే మంత్రి చెప్పారు.  దీని వెనుక ఎలాంటి రాజకీయాలు లేవు.. ఇది 100 శాతం శాస్త్రీయ ఆలోచన అని వైష్ణవ్ పేర్కొన్నారు.

మొదటి నారింజ-బూడిద రంగు వందే భారత్ రైలును సెప్టెంబర్ 24న కేరళలోని కాసరగోడ్ నుంచి తిరువనంతపురం మధ్య ప్రారంభించారు. సెప్టెంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ రైళ్లలో ఇది ఒకటి.