మూడేండ్లుగా జీహెచ్ఎంసీలో ప్రజావాణి పెట్టట్లే!

మూడేండ్లుగా జీహెచ్ఎంసీలో ప్రజావాణి పెట్టట్లే!
  • కరోనా కారణంగా 2020 మార్చి 17న నిలిపివేత
  • పరిస్థితులు నార్మల్ ​అయినా తిరిగి ప్రారంభించట్లే
  • గతవారం హైదరాబాద్​కలెక్టరేట్​లో తిరిగి మొదలు
  • బల్దియాలోనూ స్టార్ట్​ చేయాలని సిటిజన్ల రిక్వెస్టులు

హైదరాబాద్, వెలుగు:
కలెక్టరేట్లలో తిరిగి ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీలో ఎందుకు పెట్టడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిర్వహిస్తే స్థానిక సమస్యలు చెప్పుకునేందుకు వీలు కలుగుతుందంటున్నారు. కరోనా కారణంగా హైదరాబాద్​కలెక్టరేట్​తోపాటు, జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో 2020 మార్చి 17న ప్రజావాణిని నిలిపివేశారు. అయితే గత సోమవారం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్​లో తిరిగి ప్రారంభించారు. బల్దియా అధికారులు మాత్రం ఆ ఊసెత్తడం లేదు. ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలపై జనం మూడేండ్లుగా బల్దియా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

వాటితోపాటు ఇతర సమస్యలు చెప్పుకునేందుకు వస్తే ఆఫీసుల్లోనికి అనుమతించడం లేదు. కరోనాకు ముందు ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను విచారించి సంబంధిత అధికారులు న్యాయం చేసేవారు. కొన్నింటికి తక్షణమే పరిష్కారం లభించేది. డిప్యూటీ కమిషనర్ ఆఫీసుకు 30 వరకు, జోనల్ స్థాయిలో 50, హెడ్డాఫీసులో నిర్వహించే ప్రజావాణికి 100 వరకు ఫిర్యాదులు వచ్చేవి. అంతటి ప్రాధాన్యం ఉన్న కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు అధికారులు ఇంట్రెస్ట్ చూపడం లేదు. పైగా సమస్యలుంటే ఆన్ లైన్​లో చేయండని సలహాలు ఇస్తున్నారు. చాలా సమస్యలకు పరిష్కారం ఉండడం లేదని, ప్రజావాణిని తిరిగి ప్రారంభించాలని జనం డిమాండ్​చేస్తున్నారు.

ఇక్కడ ఎందుకు నిర్వహించట్లే?

హైదరాబాద్, రంగారెడ్డి​కలెక్టరేట్లలో గత సోమవారం ప్రారంభించగా, మేడ్చల్ జిల్లాలో గతేడాది నుంచే కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో స్టార్ట్​చేసేందుకు అధికారులు ఇంట్రెస్ట్​చూపించడం లేదు. పని తప్పించుకోవడానికే ప్రజావాణి నిర్వహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేయర్లుగా మాజిద్​ హుస్సేన్, బండ కార్తీకరెడ్డి ఉన్నప్పుడు ఈ కార్యక్రమానికి ఫుల్ రెస్పాన్స్ వచ్చేది.

ఆ తర్వాత బొంతు రామ్మోహన్ కొన్నాళ్లు నిర్వహించినప్పటికీ కరోనాకు ముందే నిలిపేశారు. తిరిగి నిర్వహిస్తే ప్రజా సమస్యలు ఉన్నతాధికారులకు తెలుస్తాయని జనం అభిప్రాయపడుతున్నారు. మేయర్ విజయలక్ష్మి చొరవతీసుకొని వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.