మరో నాలుగు రోజులు వర్షాలు ఉండవు: వాతావరణ శాఖ

మరో నాలుగు రోజులు వర్షాలు ఉండవు: వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని రోజులుగా దంచికొడ్తున్న వానలకు బ్రేక్ పడింది. శుక్రవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు తప్ప పెద్దగా వానలు పడలేదు. అల్పపీడనం బలహీనపడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రాబోయే నాలుగు రోజుల పాటు ఎలాంటి వర్షాలు ఉండబోవని వాతావరణ శాఖ వెల్లడించింది.

గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు అతిభారీ వర్షపాతం నమోదైంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌‌లో అత్యధికంగా 25.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అదే జిల్లా లింగాపూర్‌‌లో 23.5, పాత ఎల్లాపూర్‌‌లో 22.1, అబ్దుల్లాపూర్‌‌లో 18.5, ముధోల్‌లో 18.3, నిజామాబాద్ జిల్లా నవీపేట్, నిర్మల్ జిల్లా కుంటాలలో 18.2, జగిత్యాల జిల్లా కథియాపూర్‌‌లో 17.3 సెంటీమీటర్ల చొప్పున వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లోని గోల్కొండలో 2.3 సెంటీమీటర్ల వాన కురిసింది.