పరకాలలో హ్యాట్రిక్​ దక్కెనా?.. మూడోసారి గెలవాలని చల్లా ప్రయత్నాలు

పరకాలలో హ్యాట్రిక్​ దక్కెనా?.. మూడోసారి గెలవాలని చల్లా ప్రయత్నాలు
  • మరోసారి గెలుపు ధీమాతో సిట్టింగ్ ఎమ్మెల్యే  
  • ధర్మారెడ్డి తీరుపై  గ్రామాల్లో నిరసనలు
  • ఇదే అదునుగా కాంగ్రెస్​, బీజేపీ ప్రయత్నాలు

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గానికి ప్రత్యేక పేరుంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో  అభ్యర్థులు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్​ కొట్టిన చరిత్ర ఉండగా.. పరకాలలో మాత్రం భిన్నంగా  ఉంటుంది.  ఇక్కడ  ఎవరూ  వరుసగా మూడోసారి విజయాన్నందుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి గ్రామాల్లో నిరసనలు, నిలదీతలు ఎదురవగా.. గతంలోలాగే సిట్టింగ్​ ఎమ్మెల్యే హ్యాట్రిక్​ కు బ్రేకులు పడతాయని   కాంగ్రెస్​, బీజేపీలు భావిస్తున్నాయి. ఈ మేరకు  అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు ఆయా పార్టీలు రంగంలోకి దిగగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి   హ్యాట్రిక్​ ధీమాతోనే ఉన్నారు.  ఒకవేళ చల్లా ధర్మారెడ్డి  మూడో సారి విజయం సాధిస్తే.. పరకాల హ్యాట్రిక్​ సెంటిమెంట్​కు తెరపడనుంది.

మూడోసారి దక్కని విజయం

పరకాల సెగ్మెంట్​ 1952లో ఏర్పడగా.. అప్పటినుంచి 1972 వరకు  జనరల్ గానే ఉంది. 1952లో పీడీఎఫ్ కు చెందిన గోపాలరావు విజయం సాధించగా..  ఆ తర్వాత 1957లో  కాంగ్రెస్ కు చెందిన మంద సాయిలు గెలుపొందారు. 1962లో కాంగ్రెస్ కు చెందిన  నరసింహరామయ్య,1967లో జనసంఘ్​కు  చెందిన చందుపట్ల జంగారెడ్డి, 1972లో కాంగ్రెస్ కు చెందిన పింగళి ధర్మారెడ్డి విజయం సాధించారు. వీరంతా ఒక్కోసారి మాత్రమే విజయం సాధించి, రెండోసారికి ఓటమి చవిచూశారు.

కానీ  1978 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గ ఎస్సీలకు రిజర్వ్​ అయింది. 1978, 1983 రెండుసార్లు కాంగ్రెస్​ నుంచి  బొచ్చు సమ్మయ్య గెలుపొందారు. హ్యాట్రిక్​ ఆశలతో బరిలో నిలిచినా  1985లో బీజేపీ అభ్యర్థి ఒంటేరు జయపాల్​ చేతిలో ఓటమి చవిచూశారు. ఒంటేరు జయపాల్​ కూడా 1985, 1989లో   రెండుసార్లు గెలవగా.. ఆయన హ్యాట్రిక్​ కు సీపీఐ నేత పోతరాజు సారయ్య బ్రేకులు వేశారు.  1999లో టీడీపీకి చెందిన బొజ్జపల్లి రాజయ్య, 2004లో బీఆర్ఎస్ కుచెందిన బండారి శారారాణి గెలుపొందారు.

అనంతరం  2009లో ఈ నియోజకవర్గం జనరల్ గా మారగా..  ఆ ఎన్నికల్లో  కాంగ్రెస్​ నుంచి కొండా సురేఖ పోటీ చేసి విజయం సాధించారు. 2012లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరగగా.. అప్పుడు బీఆర్​ఎస్​ నుంచి బరిలో నిలిచిన  మొలుగూరి భిక్షపతి కొండా సురేఖపై గెలుపొందారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో సిట్టింగ్​ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరుసగా రెండు సార్లు విజయం సాధించి.. ఇప్పుడు హ్యాట్రిక్​ పై కన్నేశారు.  

గెలుపు ధీమాలో చల్లా 

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇటీవల ప్రచార కార్యక్రమాల్లో గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసనలు, నిలదీతలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నెల 2న నడికూడ మండలంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లగా.. కౌకొండ గ్రామ మహిళలు అడ్డుకున్నారు. ఊళ్లో రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేవని నిలదీశారు. అంతకుముందు వరికోల్​ గ్రామంలో డబుల్​ బెడ్​ రూం ఇండ్లు, దళితబంధు గురించి స్థానికులు నిలదీశారు. అంతేగాకుండా గ్రీన్​ ఫీల్డ్​ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు కూడా ఎమ్మెల్యే పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తన వెంట తిరిగేవాళ్లకే దళితబంధు ఇస్తానంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సాధారణ జనాల్లో వ్యతిరేకతను పెంచాయి.  

దీంతో పాటు కొన్ని గ్రామాల్లో  బీఆర్​ఎస్​ లోకల్​ లీడర్లపై ఉన్న వ్యతిరేకత కూడా ఎమ్మెల్యేకు చుట్టుకుంటోంది. దీంతో హ్యాట్రిక్​ కొట్టడం అంతా ఈజీ ఏమీ కాదని నియోజకవర్గ ప్రజల్లో చర్చ నడుస్తోంది. కానీ ప్రభుత్వ పథకాలు, నియోజకవర్గంలో చేసిన పనులే తనను గెలిపిస్తాయని  ధీమాలో చల్లా ధర్మారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ హ్యాట్రిక్ విజయం దక్కితే చల్లా ధర్మారెడ్డి మంత్రి పదవి రేసులో కూడా ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆచితూచి అడుగులేస్తున్న కాంగ్రెస్​, బీజేపీ

పరకాలలో చల్లా ధర్మారెడ్డిని ఓడగొట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్​, బీజేపీలు   కసరత్తు చేస్తున్నాయి.   ఆయనపై బలమైన అభ్యర్థిని బరిలో  నిలిపేందుకు సిద్ధమవుతున్నాయి.  కాంగ్రెస్​ నుంచి రేవూరి ప్రకాశ్​ రెడ్డిని రంగంలో దించే అవకాశం ఉంది.  బీజేపీ నుంచి బీసీ నేత డాక్టర్ కాళీప్రసాద్​, రెడ్​ క్రాస్​ చైర్మన్​ డా.పెసరు విజయచందర్​ రెడ్డి టికెట్​ ఆశిస్తుండగా.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​ కూడా  రేసులో ఉన్నారు.   దీంతో పార్టీ అధిష్ఠానం బలమైన అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. అభ్యర్థులు  ఫైనల్  కాకపోయినా..   ఆశావహులంతా ప్రచారాలు  ప్రారంభించారు.