గాడిదకు మెమోరాండం ఇచ్చి నిరసన

గాడిదకు మెమోరాండం ఇచ్చి నిరసన

చేర్యాల, వెలుగు : కడవేర్గు గ్రామంలో వంతెన నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం సీపీఐ నేతలు గాడిదకు మెమోరాండం సమర్పించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కమిటీ మెంబర్​ అందె అశోక్​ మాట్లాడుతూ చేర్యాల మండల కేంద్రం నుంచి కడవేర్గు మీదుగా యాదగిరిగుట్ట, హైదరాబాద్​ పట్టణాలకు వందలాది మంది రోజూ ప్రయాణిస్తుంటారని తెలిపారు. కానీ ఆ రోడ్డులో కల్వర్టు పూర్తిగా ధ్వంసమై నీరు ప్రవహించడంతో ప్రయాణీకులు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. గతేడాది బ్రిడ్జి నిర్మాణానికి తాత్కాలికంగా రూ.10లక్షలు కేటాయించి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నేటికీ ఆ పనులు చేయలేదన్నారు. 

ఈ విషయమై ఎమ్మెల్యేకు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చానా,  ధర్నాలు, రస్తారోకోలు చేపట్టినా ఎలాంటి స్పందనలేదని వాపోయారు. కమ్యూనిస్టుల నాయకులపై ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణం  చేపట్టాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు భూమయ్య, భాస్కర్​రెడ్డి, యాదగిరి, కనకయ్య, లక్ష్మయ్య, భద్రయ్య, వెంకటేశం, శ్రీనివాస్​, రాజు, మల్లేశం, రమేశ్, ఎల్లయ్య, శ్రీకాంత్​పాల్గొన్నారు.