ఎల్ఆర్ఎస్.. నో రెస్పాన్స్ ! ప్లాట్లు, భూముల క్రమబద్ధీకరణకు ముందుకు రాని యజమానులు..

ఎల్ఆర్ఎస్..  నో రెస్పాన్స్ ! ప్లాట్లు, భూముల క్రమబద్ధీకరణకు ముందుకు రాని యజమానులు..
  • రెండో విడత కింద మే 1 నుంచి ఈ నెలాఖరు వరకు గడువిచ్చిన ప్రభుత్వం
  • మూడు నెలల్లో 5,392 మంది యజమానులు నుంచి రూ. 32.66 కోట్లు..
  • రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2.60 లక్షల మంది నుంచి రూ. 861.70 కోట్లు వసూలు
  • ప్రొసీడింగ్స్ అందకపోవడమే కారణమని అనుమానాలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో లే అవుట్​రెగ్యులరైజేషన్ స్కీమ్​(ఎల్ ఆర్​ఎస్​)కు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించి, రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం మూడు నెలల పాటు గడువు పొడిగించింది. ఈ గడువు ఈ నెల 31తో ముగియనుంది. కానీ ఎప్పట్లాగే దరఖాస్తుదారులు ఈ సారి కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే డబ్బులు చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుండడం వల్లే ప్లాట్ల యజమానులు ఫీజు చెల్లించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 8.85 లక్షల మంది అర్హులు

అనధికార లే అవుట్లను రెగ్యులరైజ్​చేయాలన్న ఉద్దేశ్యంతో గత బీఆర్ఎస్​ ప్రభుత్వం 2015లో ఎల్​ఆర్​ఎస్​ను ప్రారంభించింది. రెండో విడత కింద ఈ స్కీమ్ ను పట్టణాలు, గ్రామాలకు వర్తింపజేస్తూ పలు మార్పులతో 2020 ఆగస్టు 31 జీవో జారీ చేసింది. 2020 ఆగస్ట్ 26 కంటే ముందు రిజిస్టర్డ్​సేల్​డీడ్ ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లను మాత్రమే రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. 

లే అవుట్ డెవలపర్లు, ప్లాట్ యజమానులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 11.47 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 

మొత్తం అప్లికేషన్లలో వివిధ కారణాలతో మూడు లక్షలకు పైగా దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది. ఇవి పోగా మిగిలిన 8.85 లక్షల దరఖాస్తులు క్లియర్ గా ఉన్నట్లు ప్రకటించారు. కానీ ఛార్జీలు వసూలు చేసే విషయంలో అప్పటి ప్రభుత్వం ఆలస్యం చేయడంతో స్కీమ్ ఆగిపోయింది. 

వన్ టైం సెటిల్ మెంట్ ను తీసుకొచ్చిన కాంగ్రెస్

కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్ ఆర్ ఎస్ స్కీమ్ ను మళ్లీ మొదలుపెట్టడంతో పాటు 25 శాతం రాయితీ కల్పిస్తూ 2025 ఫిబ్రవరిలో ‘వన్​ టైమ్​సెటిల్​మెంట్’ స్కీమ్ ను తీసుకొచ్చింది. మొత్తం అప్లికేషన్లలో 8.85 లక్షల మందిని అర్హులుగా గుర్తించగా ఫీజు చెల్లించేందుకు గతేడాది ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చింది. కానీ మొత్తం క్లియర్ అప్లికేషన్లలో 2.55 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. దీంతో మొదటి విడత కింద రూ.829.04 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 

మూడు నెలల్లో 5392 మందే...

మొదటి విడత కింద ఇచ్చిన గడువు పూర్తయ్యే లోగా రాష్ట్ర వ్యాప్తంగా 6.25 లక్షల మంది ఫీజులు చెల్లించలేదు. దీంతో 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నెల మే 1 నుంచి జులై 31 వరకు మరో మూడు నెలల పాటు గడువు ఇచ్చింది. అయినా ఫీజు చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మే నుంచి ఇప్పటి వరకు కేవలం 5,392 మంది దరఖాస్తుదారుల నుంచి రూ.32.66 కోట్ల వసూలయ్యాయి. 

మూడు నెలల్లో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయాలని ప్రభుత్వం భావించగా.. కనీసం రూ.వంద కోట్లు కూడా వసూలు కాలేదు. దీంతో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల పనితీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎల్​ఆర్​ఎస్​ విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో ఆశించిన పురోగతి ఉండట్లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫీజు చెల్లించేందుకు మరోమారు గడువు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. రెండు విడతల్లో ఇప్పటివరకు మొత్తం 2.60 లక్షల మంది రూ. 861.70 కోట్లు చెల్లించారు. 

36 శాతం మందికి ఇంకా అందని ప్రొసీడింగ్స్

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎల్​ఆర్​ఎస్​ స్కీమ్​లో డబ్బు చెల్లించిన 2.60 లక్షల మంది లబ్దిదారుల్లో ఇప్పటివరకు 1,67,258 (64 శాతం) మందికే ప్రొసీడింగ్స్ అందగా, 93,474 మందికి ప్రొసీడింగ్స్ కాపీలు అందలేదు. ల్యాండ్​వాల్యూను బట్టి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు డబ్బులు చెల్లించినా లక్షలాది మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు సర్టిఫికెట్లు అందలేదు. దీంతో పట్టణాల్లో ఇండ్లు నిర్మించుకోలేక, అవరానికి తమ ప్లాట్లను ఇతరులకు   అమ్ముకోలేక దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

నిత్యం మున్సిపాలిటీలు, కార్పొరేషన్​ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ అధికారుల నుంచి సరైన సమాధానం రావట్లేదు. టౌన్​ ప్లానింగ్​ఆఫీసర్లను అడిగితే ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి ఇంకా తమకు నో క్లియరెన్స్​రాలేదని చెప్పి దాట వేస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారు. ఫీజులు కట్టిన వారికి ప్రొసీడింగ్స్ రాకపోవడంతో కొత్తగా కట్టేవారు సైతం ముందుకురావడం లేదని తెలుస్తోంది.