కరోనా రివైజ్డ్ గైడ్ లైన్స్ జారీ చేసిన కేంద్రం  

కరోనా రివైజ్డ్ గైడ్ లైన్స్ జారీ చేసిన కేంద్రం  
  • మైల్డ్, అసింప్టమాటిక్ కేసుల్లో రీటెస్టూ అవసరంలే 
  • సొంతంగా మందులు వాడొద్దు.. టెస్టులు చేయించుకోవద్దు 
  • రివైజ్డ్ గైడ్ లైన్స్ జారీ చేసిన కేంద్రం  

న్యూఢిల్లీ: కరోనా సింప్టమ్స్ మైల్డ్ గా ఉన్నోళ్లు, సింప్టమ్స్ లేనోళ్లూ ఇకపై 7 రోజులు హోం ఐసోలేషన్ లో ఉంటే చాలని బుధవారం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇంతకుముందు 10 రోజులు హోం ఐసోలేషన్ లో ఉండాలని చెప్పిన కేంద్రం తాజాగా రిజ్డ్ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన మైల్డ్, అసింప్టమాటిక్ పేషెంట్లను 7 రోజుల తర్వాత, గత మూడురోజుల్లో ఫీవర్ వంటి సింప్టమ్స్ ఏవీ లేకుంటే డిశ్చార్జ్ అయినట్లుగా భావించాలని, రీటెస్ట్ కూడా అవసరంలేదని చెప్పింది. హోం ఐసోలేషన్ ముగిసిన తర్వాత కూడా మాస్కుల వాడకం కొనసాగించాలని పేర్కొంది. డాక్టర్ సలహా లేనిదే సొంతంగా స్టిరాయిడ్ వంటి మందులు వాడరాదని, చెస్ట్ ఎక్స్ రే, సీటీ స్కాన్ వంటివి చేయించుకోరాదని కేంద్రం సూచించింది. అలాగే అసింప్టమాటిక్ కేసుల్లో కాంటాక్టు అయిన వ్యక్తులకు కూడా టెస్టులు అవసరం లేదని, హోం క్వారంటైన్ లో ఉండి, తమ ఆరోగ్యాన్ని మానిటర్ చేసుకుంటే సరిపోతుందని వివరించింది. హోం ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లను జిల్లా స్థాయి అధికారులు సూపర్ వైజ్ చేయాలని, ఓవరాల్ గా హోం ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్లపై మానిటరింగ్ కు స్టేట్ హెల్త్ అథారిటీ బాధ్యత వహించాలని కేంద్రం ఆదేశించింది. ఫీల్డ్ లెవల్లో పేషెంట్ల పర్యవేక్షణపై ఏఎన్ఎంలు, శానిటరీ ఇన్ స్పెక్టర్లకు విధులు అప్పగించాలని చెప్పింది. హెల్త్ వర్కర్లు రోజూ పేషెంట్లను నేరుగా కలిసి లేదా ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకోవాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం, మాస్కులు, శానిటైజర్లు, పారాసిటమాల్ ట్యాబ్లెట్లతో కూడిన హోం ఐసోలేషన్ కిట్లు కూడా పంపిణీ చేయాలని తెలిపింది.  

హోం ఐసోలేషన్ కు వీళ్లనే అనుమతించాలె.. 
ఎలాంటి సింప్టమ్స్ లేకుండా, 93 శాతం ఆక్సిజన్ శాచురేషన్ ఉన్నోళ్లను అసింప్టమాటిక్ కేసులుగా పరిగణించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫీవర్ ఉన్నా, లేకపోయినా, శ్వాస ఇబ్బంది లేకుండా శ్వాసనాళానికి సంబంధించిన సింప్టమ్స్ మాత్రమే ఉంటే వారిని మైల్డ్ కేసులుగా భావించి మెడికల్ ఆఫీసర్లు హోం ఐసోలేషన్ కు సిఫారసు చేయాలని తెలిపింది. అయితే 60 ఏండ్లకు పైబడిన వృద్ధులు, డయాబెటిస్, బీపీ, గుండె, లంగ్, లివర్, కిడ్నీ జబ్బులు ఉన్నోళ్లను డాక్టర్లు ప్రాపర్ గా పరిశీలించిన తర్వాతే హోం ఐసోలేషన్​కు అనుమతించాలని వివరించింది. హెచ్ఐవీ, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్, కేన్సర్ థెరపీ ట్రీట్​మెంట్లు తీసుకుంటున్న వాళ్లకు ఇమ్యూనిటీ తక్కువుంటుంది కాబట్టి, వాళ్లను హోం ఐసోలేషన్​కు అనుమతించొద్దని స్పష్టం చేసింది.   

దేశంలో ఫస్ట్ ఒమిక్రాన్ డెత్ నమోదు  
దేశంలో ఫస్ట్ ఒమిక్రాన్ డెత్ రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో నమోదైంది. కొత్త వేరియంట్ బారిన పడిన 73 ఏండ్ల వ్యక్తి చనిపోయినట్లు బుధవారం కేంద్రం ప్రకటించింది. ఉదయ్ పూర్ లోని ఆస్పత్రిలో డిసెంబర్ 31న చనిపోయిన ఆ వృద్ధుడి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని వెల్లడించింది. అయితే, ఆ వృద్ధుడు పోస్ట్ కొవిడ్ న్యుమోనియాతో చనిపోయాడని, అతనికి డయాబెటిస్, హైబీపీ, థైరాయిడ్ సమస్య కూడా ఉన్నాయన్నారు. అతనికి డిసెంబర్ 15న పాజిటివ్ వచ్చిందని, ఫీవర్, దగ్గు, రైనైటిస్ సింప్టమ్స్ తో ఆస్పత్రిలో చేరాడన్నారు. డిసెంబర్ 21, 25 మధ్య రెండు సార్లు చేసిన టెస్టుల్లో అతనికి నెగెటివ్ వచ్చిందని, ఆ తర్వాత శాంపిల్ ను జీనోమ్ టెస్టుకు పంపగా ఒమిక్రాన్ సోకినట్లు తేలిందన్నారు.