బడి లేదు.. జీతం రాదు

బడి లేదు.. జీతం రాదు

సర్కారు బళ్లలో పార్ట్ టైం టీచర్ల కష్టాలు
రీ ఎన్రోల్ మెంట్ కోసం ఎదురుచూపులు
పిలుపు రాక కూలి పనికి పోతున్న ఉద్యోగులు

అలంపూర్, వెలుగు: స్టూడెంట్లలో వృత్తి నైపుణ్యాలు, ఫిజికల్ ఫిట్నెస్ పెంచేందుకు సర్వశిక్ష అభియాన్ కింద 2012లో తీసుకున్న క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్, పీఈటీ టీచర్ల పరిస్థితి దీనంగా ఉంది. ఏటా జూన్లో వీరిని రీ ఎన్రోల్ చేయాల్సి ఉండగా కరోనా కారణంగా స్కూళ్లు తెరుచుకోకపోవడంతో ఆ ప్రక్రియ ఆగింది. దీంతో బడి లేక, జీతం రాక చాలామంది కూలి పనులకు పోతున్నారు.

పోస్టులను కుదించిన సర్కారు
2012లో సర్వ శిక్షా అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల మంది పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్(పీటీఐ) లను రోస్టర్ విధానంలో తీసుకున్నారు. వీరిలో క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్, పీఈటీ తదితర పోస్టులున్నాయి. కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం చొప్పున జీతాలు చెల్లించాలి. ప్రతి విద్యాసంవత్సరంలో వీరిని ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన వేసవిలో రెండు నెలల పాటు వీళ్లకు ఎలాంటి జీతాలు ఉండవు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ పోస్టులను సర్కారు కుదించింది. కనీసం 150 మంది స్టూడెంట్లున్న స్కూళ్లకు మాత్రమే పరిమితం చేసింది. ప్రస్తుతం 2,892 మంది టీచర్లు మాత్రమే మిగిలారు. ఇందులో సుమారు 80శాతం మంది మహిళ ఉద్యోగులే ఉన్నారు.

అరకొర జీతం.. ఆపై నో ఎన్రోల్ మెంట్
2012లో నెలకు రూ.4500తో ప్రారంభమైన వీరి జీతం ఇప్పుడు రూ.9వేలకు చేరింది. అదీ 10 నెలలే ఇస్తున్నారు. పక్కనే ఉన్న ఏపీలో జగన్ సర్కారు మాత్రం వీరికి నెలకు రూ.18 వేల చొప్పున 12 నెలలకు వేతనాలు చెల్లిస్తోంది. ‘మన బంగారు తెలంగాణలో ఇదెక్కడి అన్యాయం?’ అని అడిగినా పట్టించుకునే నాథుడు లేడు. ఇక ఏటా జూన్ లోనే తిరిగి ఎన్రోల్ చేయాల్సిన సర్కారు ఈ ఏడాది పీటీఐ లను మినహాయించి మిగిలినవారికి ప్రొసీడింగ్స్ అందజేసింది. కరోన సాకు చూపుతూ రెండు నెలలుగా కాలయాపన చేస్తుండడంతో టీచర్లు కుటుంబ పోషణ కోసం కూలి పనులకు పోతున్నారు.

స్కూళ్లులేక ఆర్ట్ నే నమ్ముకున్నా
కోయిల్ కొండ మండలం, వింజమూరు హైస్కూల్ లో ఆర్ట్ టీచర్ గా ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నా. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఏప్రిల్ లో బడులు మూతపడడంతో అప్పటి నుంచి ఉపాధి కోల్పోయా. నాకు తెలిసిన విద్య ఆర్ట్ నే నమ్ముకున్నా. గుడులు, గోపురాలకు రంగులు వేస్తూ జీవితాన్ని సాగిస్తున్నా.
‑శ్రీనివాసరెడ్డి, తిరుమలపురం, నారాయణపేట జిల్లా

ఆదుకోవాల్సింది పోయి కోతలా..
కేంద్రం ఇచ్చే నిధులనే జీతాలుగా ఇస్తూ కూడా పీఈటీల పునర్ నియామకాలు చేపట్టకపోవడం చాలా బాధాకరం. కరోనా క్రైసిస్ లో ఆదుకోవాల్సిందిపోయి కేంద్రం ఇచ్చే జీతాలలో కోత విధించడం మరీ దారుణం. వెంటనే ప్రొసీడింగ్స్ ఇచ్చి జూన్ నుంచి వేతనాలివ్వాలి. వారిని రెగ్యులరైజ్ చేయాలి.
‑ ఆర్ట్, క్రాఫ్ట్ ఇన్ స్ట్రక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవకుమార్

For More News..

ఐటీ ఉద్యోగులకు లేఆఫ్ కష్టాలు

తెలంగాణలో 20 రోజుల్లో 30 వేల కేసులు

చికెన్లో మత్తు కలిపి.. తల్లీ కూతుళ్లపై గ్యాంగ్ రేప్