
రాజస్థాన్లో ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిల్
ప్రజలకు దూరంగా ఎమ్మెల్యేలు హోటళ్లలోనే ఉంటున్నరు
డ్యూటీ చేయట్లే కాబట్టి జీతాలివ్వొద్దు
జైపూర్: ‘ప్రజాసేవ చేయాల్సిన ఎమ్మెల్యేలు ఆ పని మానేసి వారాలపాటు హోటళ్లలో ఉంటున్నారు.. వాళ్ల పని వాళ్లు చేయనప్పుడు వారికి జీతాలు, అలవెన్సులు ఎందుకివ్వాలి? కోర్టు జోక్యం చేసుకుని వారికి జీతం కానీ, ఇతరత్రా అలవెన్సులు కానీ ఇవ్వొద్దని ఆదేశించాలి’ అంటూ రాజస్థాన్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. వివేక్ సింగ్ జాదౌన్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేయగా, లాయర్ గజేంద్ర సింగ్ రాథోర్ వాదించనున్నారు. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య తలెత్తిన మనస్పర్థలు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలట్ సహా అతని మద్దతుదారులు 19 మంది ఎమ్మెల్యేలను రెబెల్స్ గా ప్రకటించింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి గెహ్లాట్ వర్గంలో ఎమ్మెల్యేలు దాదాపు 2 వారాల పాటు జైపూర్లో ఓ హోటల్లో ఉన్నారు. తాజాగా అసెంబ్లీ సెషన్ నిర్వహణపై గవర్నర్ క్లారిటీ ఇవ్వడంతో గెహ్లాట్ తన మద్దతుదారులను జైసల్మేర్ కు తరలించారు. కొద్ది వారాలుగా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతుంటే.. వారికి అందుబాటులో ఉంటూ సేవ చేయాల్సిన ఎమ్మెల్యేలు హోటళ్లలో ఉంటున్నారని వివేక్ సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో లేకుంటే ఎట్లా?
‘ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయడం వారి బాధ్యత.. దాని కోసమే వారికి ప్రభుత్వం జీతాలు, అలవెన్సులను ఇస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరగని టైంలో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకుండా హోటళ్లలో ఉండడమేంటి? నియోజకవర్గంలో వారి తరఫున బాధ్యత తీసుకుని పనిచేసే వాళ్లు కూడా లేరు. ప్రజలకు మరియు తమ విధులకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలకు జీతాలు డ్రా చేసుకునే నైతికహక్కు లేదు’ అని పిటిషనర్ వికాస్ సింగ్ మీడియాకు చెప్పారు.
For More News..