జీవో ఇచ్చి నెలైనా జీతం పెరగలె

జీవో ఇచ్చి నెలైనా జీతం పెరగలె
  • జేపీఎస్​ల జీతం పెంపునకు గత నెల19న జీవో ఇచ్చిన సర్కారు
  • బిల్లులు ఇన్​టైమ్​లో పంపక.. పెరిగిన జీతం అందలే
  • కొన్ని చోట్ల పాత జీతాలు కూడా రాలేదని జేపీఎస్​ల ఆవేదన

హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా పనిచేస్తున్న 9 వేల మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జీపీఎస్​)కు ప్రభుత్వం గత నెల19న జీతాలు పెంచింది. 15 వేలు ఉన్న జీతాన్ని రూ. 28 వేలకు పెంచుతూ పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో 26ను విడుదల చేశారు. అయినా ఆగస్టు నెలలో జేపీఎస్​లకు పెంచిన జీతం రాలేదు. కొన్ని చోట్ల పాత జీతాలు కూడా ఇంకా రాకపోవడం గమనార్హం. పెరిగిన జీతాలకు సంబంధించిన ఆయా మండలాల ఎంపీడీవోలు బిల్స్​ను ట్రెజరీ ఆఫీసుల్లో సబ్మిట్ చేయకపోవడం, కొన్ని చోట్ల బిల్స్ సబ్మిట్ చేసినా ఖజానాలో నిధులు లేక కొత్త జీతాలు అందలేదని తెలుస్తోంది. జీతాలను పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటి వరకు పెంచిన మొత్తం చేతికి రాకపోవడంతో జీపీఎస్​లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నో క్లారిటీ
గత నెల జీతం పెంచుతూ జీవో ఇచ్చినప్పటికీ పాత జీతమా, కొత్త జీతమా అన్న విషయంపై ఉన్నతాధికారులనుంచి క్లారిటీ రాలేదని ఎంపీడీవోలు అంటున్నారు. అందుకే పాత జీతాలతో బిల్స్ సబ్మిట్ చేశామని కరీంనగర్ కు చెందిన ఓ ఎంపీడీవో పేర్కొన్నారు.

కొన్ని చోట్ల ఆలస్యంగా..
జేపీఎస్​ల జీతాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి బడ్జెట్ రిలీజ్ చేస్తోంది. పెంచిన జీతంపై జీవో ఇచ్చినప్పటికీ అందుకు అనుగుణంగా పంచాయతీ​రాజ్​శాఖ ట్రెజరీకి నిధులు కేటాయించలేదని తెలుస్తోంది. నెలల తరబడి తమకు జీతాలు రావడం లేదని కొన్ని జిల్లాల జేపీఎస్​లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం12 గంటలకు పైగా డ్యూటీ చేస్తుంటే జీతాలు ఇన్ టైంలో ఇయ్యకపోతే కుటుంబాలు ఎలా గడవాలని వారు ప్రశ్నిస్తున్నారు.

చాలా చోట్ల జీతం రాలేదు
జేపీఎస్ ల జీతం పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చినా పాత జీతమే వచ్చిందే. రాష్ర్టంలో 9వేల మంది పనిచేస్తుంటే 300 మందికి మాత్రమే పెరిగిన జీతం వచ్చింది. అధికారులు పెరిగిన జీతానికి సంబంధించిన బిల్స్ సబ్మిట్ చేయలేదు. చేసిన చోట్ల ట్రెజరీలో ఫండ్స్ లేవని సమాధానం చెబుతున్నారు. వికారాబాద్ జిల్లాలో జేపీఎస్​లకు నాలుగు నెలలుగా జీతాలు అందటం లేదు.  ఇచ్చే రూ.15 వేల జీతం టైంకు ఇయ్యకపోతే జాబ్ ఎట్ల చేయాలె. పెరిగిన శాలరీస్ వెంటనే విడుదల చేయాలి. పెరిగిన జీతం బకాయిలు ఆగస్టు జీతంతో ఇయ్యాలె.
- జేపీఎస్ అసోసియేషన్ నేత

మూడేండ్ల నుంచి పనిచేస్తున్నం
మూడేండ్ల నుంచి రూ.15 వేలకే చేస్తున్నం. శాలరీ పెరుగుతుందంటే సంతోషపడ్డం. కానీ పెరిగిన శాలరీ రాలేదు. మే, జూన్ నెలలు జీతాలు ఆగినయి. బడ్జెట్ లేకపోవటంతో లేట్​అవుతుందని అధికారులు అంటున్నరు. బడ్జెట్ రిలీజ్ చేస్తే తప్ప పెరిగిన జీతం రాదని మండల అధికారులు చెబుతున్నారు. ఆరు మండలాల్లో పనిచేస్తున్న జేపీఎస్ లకు జీతాలు అందటం లేదు. కమిషనర్ కు లెటర్ పెట్టినం అని డీపీవోలు చెబుతున్నరు. ఉన్నదే కొద్దిగ జీతం.. అది కూడ టైంకు ఇయ్యక ఎట్ల బతకాలో అర్థం కావట్లేదు.
- తొర్రూరుకు చెందిన జేపీఎస్