దేవుడా..గుడికేది దిక్కు!

దేవుడా..గుడికేది దిక్కు!

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌లో జరుగుతున్న దొంగతనాలను నివారించడం పోలీసులకు సవాల్‌‌‌‌ మారుతోంది. నాలుగు రోజుల కింద నేషనల్ హైవేలో ఉన్న బుస్సాపూర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన బ్యాంక్ దోపిడీ తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత ఉన్న బ్యాంక్‌‌‌‌కు కన్నం వేసి రూ.2 కోట్ల విలువైన బంగారం, రూ.7.30 లక్షల నగదు ఎత్తుకెళ్లారంటే జిల్లాలో నిఘా వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చోరీకి పాల్పడిన వారు ప్రొఫెషనల్‌‌‌‌ దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదేకాక జిల్లాలో కొన్ని రోజులుగా దేవాలయాల్లో కూడా చోరీలు పెరిగిపోయాయి. నిజామాబాద్‌‌‌‌ నగరంలోని హమాల్‌‌‌‌వాడీ సాయిబాబా ఆలయంలో సెక్యూరిటీ గార్డును కొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. నిజామాబాద్‌‌‌‌లోని ఖిల్లా సమీపంలో హుండీతో పాటు విలువైన వస్తువులను అపహరించుకెళ్లారు. త్రీ టౌన్‌‌‌‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు ఆలయాల్లో హుండీలు ఎత్తుకెళ్లారు. సారంగపూర్‌‌‌‌ హనుమాన్‌‌‌‌ మందిరంలోనూ చోరీ జరిగింది. కామారెడ్డి, ఇందల్‌‌‌‌వాయి, ధర్పల్లి, ఆర్మూర్‌‌‌‌, బోధన్‌‌‌‌ ప్రాంతాల్లోని పలు గుడుల్లో దొంగతనాలు జరిగాయి.   

ఉమ్మడి జిల్లాలో 1,325 టెంపుల్స్‌‌‌‌..
నిజామాబాద్‌‌‌‌, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 1,325 ఆలయాలు ఉన్నాయి. ఇందులో 350 గుడులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. సుమారు 200 పైచిలుకు వాటిల్లో ఏటా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది. ఆలయాల్లో దేవతామూర్తులకు అలంకరించే బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయి. ఈ మొత్తం ఆలయాల్లో 25 నుంచి 30 గుడుల్లో మాత్రమే రక్షణ వ్యవస్థ ఉంది. సెక్యూరిటీ లేని గుడుల్లో దొంగతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండే చిల్లర దొంగలు సైతం సులువుగా చోరీలు చేసి ఉడాయిస్తున్నారు. ఆలయాల్లో సెక్యూరిటీ సిబ్బంది నియామకంపై దేవాదాయ శాఖ చర్యలు చేపట్టడం లేదు. నిధులు లేవన్న కారణంతో సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు ఆలయాల్లో చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లలో 150పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు  నామమాత్రంగా విచారణ చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆలయాలకు రక్షణ కల్పించండి
ప్రభుత్వం దేవాల‌‌‌‌యాల‌‌‌‌ భద్రతపై దృష్టి పెట్టాలి. సెక్యూరిటీ సిబ్బందిని నియమించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రధాన దేవాల‌‌‌‌యాలు ఉన్న చోట పోలీసుల గ‌‌‌‌స్తీ పెంచాలి.                                                                                                                                                                           - సతీశ్, ధర్మజాగరణ్‌‌‌‌, జిల్లా కన్వీనర్

నిఘా పెంచుతాం..
జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచుతాం. సెక్యూరిటీ లేని ఆలయాల్లోనే చోరీలు జరుగుతున్నట్లు మా విచారణలో తేలింది. అధిక ఆదాయం ఉన్న టెంపుల్స్‌‌‌‌లో సెక్యూరిటీని నియమించాలని దేవాదాయశాఖకు సూచించాం.                                                 - కె.ఆర్‌‌‌‌‌‌‌‌ నాగరాజు, సీపీ నిజామాబాద్‌‌‌‌