ఫిబ్రవరి 1న వచ్చేది కేవలం ఓటాన్ అకౌంట్ మాత్రమే : నిర్మలా సీతారామన్‌‌‌‌

ఫిబ్రవరి 1న వచ్చేది కేవలం ఓటాన్ అకౌంట్ మాత్రమే : నిర్మలా సీతారామన్‌‌‌‌
  • జులైలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌‌‌‌లో పెద్ద ప్రకటనలు ఉంటాయి
  • అభివృద్ధి చెందిన దేశాలు బార్డర్ ట్యాక్స్ వేయడం అనైతికం : నిర్మలా సీతారామన్‌‌‌‌

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టబోయే తాత్కాలిక బడ్జెట్‌‌‌‌లో ఎటువంటి సర్‌‌‌‌ప్రైజ్‌‌‌‌లు ఉండవని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇది కేవలం జనరల్ ఎలక్షన్స్ ముందు వచ్చే ఓటాన్‌‌‌‌ అకౌంట్ బడ్జెట్ మాత్రమేనని  చెప్పారు.  కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అవసరం అయ్యే ఖర్చుల కోసం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్‌‌‌‌ను ఓటాన్ అకౌంట్ అంటారు.   ఈ బడ్జెట్ ముందు ఎకనామిక్‌‌‌‌ సర్వే ప్రకటించరు.  2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను  వచ్చే ఏడాది జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌‌‌‌ను కొత్త కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ ఫోరమ్‌‌‌‌లో ఆమె వెల్లడించారు.  ఎలక్షన్ మోడ్‌‌‌‌లో ఉంటాం కాబట్టి  కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అయ్యే ఖర్చుల కోసం మాత్రమే ఈ తాత్కాలిక బడ్జెట్‌‌‌‌ ఉంటుందని  వివరించారు. కొత్త   ప్రకటనల కోసం  జులై వరకు వెయిట్ చేయాలని చెప్పారు.  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో  అదిరిపోయే బడ్జెట్‌‌‌‌  ప్రవేశ పెడతారా? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాలు పంచుకున్నారు. 2019 లో  తాత్కాలిక బడ్జెట్‌‌‌‌ను పీయూష్ గోయెల్‌‌‌‌  ప్రవేశ పెట్టారు.  అనారోగ్యంతో అరుణ్ జైట్లీ హాస్పిటల్‌‌‌‌లో చేరగా, అప్పుడు గోయెల్‌‌ ఫైనాన్స్ మినిస్ట్రీ చూసుకున్నారు.  నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 లో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి  నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా సేవలందిస్తున్నారు. అదే ఏడాది జులై 5 న పూర్తి స్థాయి బడ్జెట్‌‌‌‌ను ప్రవేశ పెట్టారు.

సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌‌‌లో ఎటువంటి పెద్ద అనౌన్స్‌‌‌‌మెంట్లు ఉండవు. కానీ, కావాలనుకుంటే ప్రభుత్వం  ప్రకటించొచ్చు. 2019 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌‌‌లో ఇలాంటి ప్రకటననే పీయూష్ గోయల్ చేశారు. 12 కోట్ల మంది రైతులకు మేలు జరిగేలా ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు.  అంతేకాకుండా మిడిల్ క్లాస్‌‌‌‌కు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రకటించారు. ఉద్యోగులు ఇన్‌‌‌‌కం ట్యాక్స్ నుంచి రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్‌‌‌‌  పొందడానికి అవకాశం కలిపించారు. అంతకు ముందు ఇది రూ.40 వేలు ఉంది. రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్న వారికి ట్యాక్స్ రిబేట్‌‌‌‌ను ప్రకటించారు. అంటే ఈ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌లోపు సంపాదించే వారు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని అర్థం.

ఇంపోర్ట్‌‌‌‌లపై కార్బన్ ట్యాక్స్‌‌‌‌!

అభివృద్ధి చెందిన దేశాలు తమ ఇంపోర్ట్‌‌‌‌లపై కార్బన్ ట్యాక్స్  వేయాలని చూస్తున్నాయని, తమ దేశాల్లోని ఎన్విరాన్‌‌‌‌మెంటల్‌‌‌‌ గోల్స్‌‌‌‌ చేరుకోవడానికి సుంకాలను వేయాలనుకుంటున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇది అనైతికమైన చర్య అని అన్నారు. అన్ని దేశాలు కలిసి గ్రీన్ గోల్స్‌‌‌‌ చేరుకోవాలని, అంతేకాని బార్డర్ ట్యాక్స్ వేయడానికి తమకు తాముగా నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పారు. ‘నా ఇండస్ట్రీని గ్రీన్‌‌‌‌గా మార్చాలని చూస్తున్నాను. పర్యావరణానికి మేలు చేయని ప్రొడక్ట్‌‌‌‌లను అమ్ముతున్నందుకు నీ దేశంపై సుంకాలు వేస్తాం.  ఈ సుంకాలతో నా ఇండస్ట్రీని గ్రీన్‌‌‌‌గా మార్చుకుంటా.. బార్డర్ అడ్జెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ట్యాక్స్ లాజిక్‌‌‌‌ ఇలానే ఉంది. గ్లోబల్‌‌‌‌ సౌత్‌‌‌‌ దేశాల ఆందోళనలను ఇవి పట్టించుకోవడం లేదు’ అని వివరించారు. ప్రతీ దేశం తాము కట్టుబడిన గ్రీన్ గోల్స్‌‌‌‌ను తమకు తాము చేరుకోవాలని అన్నారు.  కొన్ని సెక్టార్ల ఇంపోర్ట్స్‌‌‌‌పై  కార్బన్ ట్యాక్స్ వేస్తామని యూరోపియన్ యూనియన్  ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశిస్తూ సీతారామన్ పైవిధంగా మాట్లాడారు.  కార్బన్ బార్డర్ అడ్జస్ట్‌‌‌‌మెంట్ మెకానిజం ట్యాక్స్  2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ సెక్టార్లలో రెండో ప్లేస్‌‌‌‌లో!

తయారీ రంగానికి రెండో అతిపెద్ద హబ్‌‌‌‌గా ఇండియా ఎదుగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. కంపెనీలు మన దగ్గర ప్లాంట్లు పెట్టడానికి ముందుకొస్తున్నాయని చెప్పారు. పీఎల్ఐ వంటి స్కీమ్‌‌‌‌లతో ఆర్థిక వ్యవస్థలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ వాటా పెరుగుతోందని రాజ్యసభలో ఆమె పేర్కొన్నారు.   ‘ మేకిన్ ఇండియా ప్రోగ్రామ్‌‌‌‌, మోదీ తెచ్చిన స్కీమ్‌‌‌‌లతో అన్ని సెక్టార్లు వృద్ధి చెందుతున్నాయి. ఎకానమీలో మాన్యుఫాక్చరింగ్ వాటా 13.9 శాతానికి పెరిగింది. మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ ఇండెక్స్ నవంబర్‌‌‌‌‌‌‌‌లో 56 గా రికార్డయ్యింది. దీనర్థం ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో గ్రోత్ బాటలో ఉంది’ అని సీతారామన్ అన్నారు.  ‘మన సెకెండ్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ వృద్ధి రేటు ప్రపంచంలోనే ఎక్కువగా ఉంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతున్నాం’ అని వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 7.6 శాతం జీడీపీ గ్రోత్ రేటు సాధించామని చెప్పారు. కేవలం ఎనిమిదేళ్లలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారామని నిర్మల అన్నారు.