
- చిరంజీవికి హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ వచ్చే నెల 25కు వాయిదా
హైదరాబాద్, వెలుగు : జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన 595 చదరపు గజాల స్థలంలో ఏవిధమైన నిర్మాణాలు చేయరాదని యాక్టర్ చిరంజీవికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఆ జాగాలో యథాతథ స్థితిని కొనసాగించాలని జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ పర్పస్ కోసం ఆ స్థలాన్ని వినియోగించాలని గతంలో జీహెచ్‌ఎంసీకి జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆ స్థలం అప్పగించింది. అదే 595 చదరపు గజాలను సినీ నటుడు చిరంజీవికి సొసైటీ కేటాయించడాన్ని శ్రీకాంత్ బాబు, మరో ఇద్దరు హైకోర్టులో సవాల్ చేశారు. సీనియర్ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్, లాయర్ రోహిత్ పోగుల వాదిస్తూ చిరంజీవికి జాగా ఇవ్వాలని సొసైటీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన డాక్యుమెంట్లను తెప్పించుకోవాలని కోరారు.
సొసైటీ మేనేజింగ్ కమిటీ, వార్షిక సర్వసభ్య సమావేశాల ఆమోద రికార్డులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీకి అప్పగించిన 595 చదరపు గజాలను చిరంజీవికి విక్రయించడం చెల్లదన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. సొసైటీ జాగాలో నిర్మాణాలు చేపట్టరాదని చిరంజీవితో పాటు మరి కొందరిని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని సొసైటీ, చిరంజీవి, జీహెచ్‌ఎంసీకి నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.