ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 151ను బీఎన్‌పీ దాటేసింది. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం (ఫిబ్రవరి13) ఉదయం 5 గంటలకు వెలుబడిన ఫలితాల్లో బీఎన్ పీ కూటమి 151 సీట్లు,మరో పార్టీ జమాతే ఇస్లామీ కూటమి 70 సీట్లు గెలుచుకుందని స్థానిక మీడియా తెలిపింది.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) చైర్‌పర్సన్ తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించారని ప్రకటించారు. బీఎన్ పీ చీఫ్ తారిఖ్ రెహ్మాన్ పోటీ చేసిన రెండు చోట్లా గెలుపొందారు. తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధాని రేసులో ఉన్నారు. తారిఖ్ రెహమాన్ ..మాజీ ప్రధాని, బిఎన్‌పి చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా కుమారుడు. ఆమె మరణించిన తర్వాత జనవరి 9న పార్టీ ఛైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
బంగ్లాదేశ్ లో మొత్తం 299 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 150.. కాగా ఒక అభ్యర్థి మరణించడంతో షేర్ పూర్ నియోజకవర్గంలో పోలింగ్ నిలిపివేశారు. బంగ్లాదేశ్ పార్లమెంటులో 50 సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు.
