ఉగాది కి సనత్ నగర్ టిమ్స్ షురూ! : మంత్రి దామోదర రాజనర్సింహ

ఉగాది కి సనత్ నగర్ టిమ్స్ షురూ! : మంత్రి దామోదర రాజనర్సింహ
  • మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తి  కావాలి
  • అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: సనత్‌‌నగర్ తెలంగాణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీఐఎమ్ఎస్) హాస్పిటల్ ను ఉగాది పండుగ నాడు ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈలోగా సివిల్ పనులు, ఎక్విప్‌‌మెంట్ ట్రయల్స్ పూర్తిచేసి, హాస్పిటల్ ను రెడీగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌ ఆఫీస్‌‌లో టిమ్స్ పనుల పురోగతిపై మంత్రి హైలెవల్ రివ్యూ నిర్వహించారు. 

ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, డీఎంఈ నరేంద్ర కుమార్, టీజీఎంఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి హాస్పిటల్ లో మౌలిక వసతులు, డాక్టర్ల నియామకంపై చర్చించారు. ఈ సందర్భంగా వెయ్యి బెడ్స్, అత్యంత కీలకమైన 16 ఆపరేషన్ థియేటర్లు సర్జరీలకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. 

రోగ నిర్ధారణ కోసం హైఎండ్ సీటీ స్కాన్, ఎంఆర్‌‌ఐ, డిజిటల్ ఎక్స్- రే మిషన్ల బిగింపు, డయాగ్నస్టిక్స్ మెషిన్లు ఇన్‌‌ స్టాలేషన్ స్పీడ్ గా జరుతున్నట్టు తెలిపారు. మార్చి రెండో వారానికల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి, ఎక్విప్‌‌మెంట్ ట్రయల్ రన్స్ నిర్వహించాలని మంత్రి అధికారులకు డెడ్ లైన్ విధించారు. టెక్నీషియన్లకు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా అప్పటికే పూర్తి చేయాలన్నారు. టిమ్స్ లో కేవలం వైద్యమే కాదు.. నిర్వహణ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉండాలని మంత్రి ఆదేశించారు.

సీనియర్ ప్రొఫెసర్లు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నియామక ప్రక్రియపై ఆరా తీశారు. డీఎంఈ, నిమ్స్ పరిధిలోని సీనియర్ డాక్టర్ల సేవలను ఇక్కడ వినియోగించుకోవాలన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ విషయంలో ఢిల్లీ ఎయిమ్స్, నిమ్స్ లోని బెస్ట్ విధానాలను ఇక్కడ అమలు చేయనున్నారు. పేషెంట్ హాస్పిటల్ కు రాగానే ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు అంతా ఆన్‌‌ లైన్‌‌ లో ఉండేలా ఈ-హెచ్‌‌ఎంఐఎస్ (ఈ హెచ్ఎంఐఎస్) సాఫ్ట్‌‌ వేర్ ను వాడనున్నారు. పేషెంట్లకు, అటెండెంట్లకు క్వాలిటీ ఫుడ్ కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయనున్నారు.  

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా.. 

సనత్‌‌నగర్ టిమ్స్‌‌ను సాధారణ హాస్పిటల్ లా కాకుండా.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేసేలా క్యాథల్యాబ్స్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్లును ఏర్పాటు చేస్తున్నారు. క్యాథల్యాబ్ పనులు చివరి దశలో ఉన్నాయని అధికారులు చెప్పారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ ఆపరేషన్ల కోసం నెలల తరబడి వెయిటింగ్ లిస్ట్ ఉంటోంది. ఆ రద్దీని తగ్గించేలా.. అక్కడి పేషెంట్లను టిమ్స్ కు రిఫర్ చేసి వెంటనే వైద్యం అందించేలా ప్లాన్ చేస్తున్నారు.