
- మేడారం డ్యూటీలు చేసిన పోలీసోళ్లకు టీఏ ఇయ్యలే
- ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన మహాజాతర
- వారం.. పది రోజులకు పైగా బందోబస్తు డ్యూటీలో పోలీసులు
- నేటికీ పట్టించుకోని సర్కారు
వరంగల్, వెలుగు: మేడారం మహా జాతరలో చలి, ఎండ లెక్క చేయకుండా డ్యూటీలు చేసిన వేలాదిమంది పోలీసోళ్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చి మేడారం అడవుల్లో వారం, పది రోజుల బందోబస్తు పనులు చేసినవారికి టీఏ(ట్రావెల్ అలవెన్స్) ఇప్పటికీ ఇవ్వలేదు. గతంలో డ్యూటీలు చేసే టైంలోనే వేసే టీఏ ఈసారి మాత్రం జాతర ముగిసి నెల దాటినా అందలేదు. దీనికితోడు ఏడాదికి మూడుసార్లు అందించే సరెండర్స్ లో రెండు పెండింగ్ ఉన్నాయి. వీటి మీద ఆశతో వేలాది మంది కానిస్టేబుళ్లు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో రూల్స్ కు విరుద్ధంగా ఏదైన మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనే భయంతో లోలోపలే కుమిలిపోతున్నారు.
పది రోజుల ముందే అడవి బాట
ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు పోలీస్ శాఖ దాదాపు 10 వేల మందికి పైగా సిబ్బందికి మేడారం డ్యూటీలు వేసింది. స్థానిక ములుగు జిల్లాతో పాటు వరంగల్ కమిషనరేట్, మహబూబాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి సిబ్బంది తరలివెళ్లారు. నెల ముందునుంచే దాదాపు వెయ్యి మంది పోలీసులు సేవలు అందించగా.. ఫిబ్రవరి 10 నుంచి మిగిలిన ఖాకీలు అడవి బాట పట్టారు. జాతర ప్రాంతంలో 382 సీసీ కెమెరాలు, 2 డ్రోన్లు, 33 డిస్‍ప్లే బోర్డులు, ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక ఔట్‍పోస్ట్, ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పెట్రోలింగ్ టీం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో గద్దెల ప్రాంతంలో డ్యూటీ చేసినవారు చెమటోడ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా ఒక్కో టాస్క్ఫోర్స్కానిస్టేబుల్కు నెలకు రూ.5 వేల టీఏ అందిస్తున్నారు. సిటీ సెక్యూరిటీ వింగ్ (సీఎస్‍డబ్ల్యూ) రూ.4,500, క్విక్ రియాక్షన్ టీం(క్యూఆర్‍టీ) రూ.3,500, ఆర్మ్ డ్రిజర్డ్వ్(ఏఆర్) రూ.2,500, లా అండ్ ఆర్డర్ వచ్చేసరికి అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఆధారంగా చెల్లిస్తున్నారు. గత మేడారం జాతరలో హోదా, సీనియారిటీ, డ్యూటీ చేసిన రోజుల ఆధారంగా రూ.2 వేల నుంచి 10 వేలకు పైగా అందరికీ అప్పటికప్పుడు టీఏ చెల్లించారు. ఈసారి మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి.
సరెండర్స్ ఇయ్యట్లే.. ఇంక్రిమెంట్లు పడట్లే
పోలీస్ సిబ్బందికి ఏటా మూడుసార్లు శాలరీ బేసిక్‍లో 50 శాతం సరెండర్గా ఇస్తారు. జనవరి, జూన్, నవంబర్ నెలలకు ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాతి నెల జీతంలో ఈ మొత్తం కలిపి చెల్లిస్తారు. కాగా, గతేడాది నవంబర్, కొత్త ఏడాది జనవరిలో ఇవ్వాల్సిన రెండు సరెండర్స్ ఇంకా చెల్లించలేదు. డిపార్డ్మెంట్లో 12 ఏండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంది. వీటిని సైతం పట్టించుకోవడంలేదని ఖాకీలు వాపోతున్నారు.
ముచ్చింతల్ డ్యూటీ చేసినోళ్లకు ఇచ్చిన్రు
ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు 12 రోజులు ముచ్చింతల్ శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ వివిధ జిల్లాల్లోని దాదాపు 7 నుంచి 8 వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టింది. ముచ్చింతల్ స్పెషల్ డ్యూటీలు చేసినవారందరికీ వెంటనే టీఏ ఇచ్చారు. మేడారంలో డ్యూటీ చేసిన పోలీసులను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఒకే శాఖలో ఒకే తరహా డ్యూటీలకు ఇదేం తేడా అని టీఏ రాని వేలాది మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.