నిర్మాత బండ్ల గణేష్ కు చుక్కెదురు.. నో టికెట్

నిర్మాత బండ్ల గణేష్ కు చుక్కెదురు.. నో టికెట్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికీ టికెట్ కేటాయించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనే టికెట్ల కోసం చాలా మంది సినీ ప్రముఖులు ట్రై చేశారు. అప్పుడు అవకాశం దక్కకపోవడంతో.. లోక్​సభ ఎన్నికల్లో అయినా పోటీ చేద్దామనుకున్నారు. చివరికి ఇప్పుడు కూడా టికెట్లు ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ మొత్తం 17 మందిని అనౌన్స్ చేసింది. వీరిలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరూ లేరు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

నిర్మాత బండ్ల గణేశ్​కు చుక్కెదురు

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్ నుంచి ఆయన కాంగ్రెస్​లో యాక్టివ్​గా ఉన్నారు. గాంధీభవన్​లో నిర్వహించే ప్రెస్​మీట్లకు అటెండ్ అవుతూ.. బీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై విమర్శలు చేస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని సీఎం రేవంత్​తో పాటు కీలక నేతలను కోరుతూ వచ్చారు. రేవంత్ సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన సునీతా మహేందర్ రెడ్డికి ఆ స్థానం కేటాయించడంతో బండ్ల గణేశ్​కు నిరాశే మిగిలింది. ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆయన్ను బుజ్జగించినట్టు సమాచారం.