విజయ శాంతి దిల్ రాజులకు దక్కని సీట్లు

విజయ శాంతి దిల్ రాజులకు దక్కని సీట్లు

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికీ టికెట్ కేటాయించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనే టికెట్ల కోసం చాలా మంది సినీ ప్రముఖులు ట్రై చేశారు. అప్పుడు అవకాశం దక్కకపోవడంతో.. లోక్​సభ ఎన్నికల్లో అయినా పోటీ చేద్దామనుకున్నారు. చివరికి ఇప్పుడు కూడా టికెట్లు ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ మొత్తం 17 మందిని అనౌన్స్ చేసింది. వీరిలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరూ లేరు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

విజయశాంతికి దక్కని మల్కాజిగిరి సీటు

2009లో మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి.. తర్వాత 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్​లో చేరారు. మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019లో మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్​లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ.. కాంగ్రెస్ మల్కాజిగిరి అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆమెకు నిరాశ ఎదురైంది. కాగా, ఎమ్మెల్సీ లేదా మరో కీలక పదవి ఇస్తామని విజయశాంతికి కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్టు సమాచారం.

నిజామాబాద్ ఎంపీ సీటు కోసంకాంగ్రెస్​లో పోటాపోటీ

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు (వెంకట్రామ్ రెడ్డి) పేరు 2014 అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల నుంచి వినిపిస్తున్నది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఆయన ఏ స్థానం నుంచి కూడా పోటీ చేయలేదు. తాజాగా జహీరాబాద్ ఎంపీ టికెట్​ను దిల్​రాజుకు బీజేపీ ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్​కు ఆ స్థానాన్ని కేటాయించింది. తన అన్న నర్సింహారెడ్డికి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను దిల్ రాజు కోరుతున్నట్టు సమాచారం. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, బాల్కొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సునీల్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది.