రష్యా హ్యాండిచ్చింది.. ఆర్మీని రంగంలోకి దించే సమయం ఆసన్నమైంది: ఉక్రెయిన్

రష్యా హ్యాండిచ్చింది..  ఆర్మీని రంగంలోకి దించే సమయం ఆసన్నమైంది: ఉక్రెయిన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందనుకునే లోపే మళ్లీ రెండు దేశాల మధ్య వేడి రాజుకుంటుంది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని నివారిస్తానని యూఎస్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ ప్రకటించాడు. అయినా ఆ వైపుగా చర్యలు తీసుకుంటున్నన పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

తమకు రష్యా హ్యాండిచ్చిందని..  అమెరికా సహాయం చేసే పరిస్థితి కనిపించడం లేదని.. ఇక యూరోపియన్ ఆర్మీని రంగంలోకి దింపే సమయం ఆసన్నమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని నివారించే క్రమంలో చర్చలు చేపడతామని చెప్పిన రష్యా.. తమకు హ్యాండిచ్చిందని.. ఎలాంటి చర్చలు జరపకపోగా.. యుద్ధానికి కవ్విస్తూ తన సహజ వైఖరిని కనబరుస్తోందని అన్నారు.  

రష్యాతో ఉక్రెయిన్ సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తోందని, యూరోపియన్ ఆర్మీని ఆల్ రెడీ తాము ప్రారంభించినట్లేనని కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ ఆర్మీ ఆల్ రెడీ ఉందని తమ దేశాన్ని చూసి నిర్ధారణ చేసుకోవాలని అన్నారు. 

జర్మనీలోని మ్యునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన.. యూరోప్ ఆర్మీని ఏర్పాటు చేసుకోవడానికి అమెరికా మద్ధతు ఇవ్వదని.. తనకు ఎప్పటికైనా సవాలేనని యూఎస్ భావిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. 

’’యూరోప్ ఆర్మీని ఏర్పాటు చేసుకునే టైమ్ వచ్చిందని నేను నమ్ముతున్నాను.. యూరోప్ భవిష్యత్తు యూరోపియన్లపైనే ఆధారపడి ఉంది.. రష్యాకు శాంతి అవసరం లేదు.. చర్చలకు సిద్ధంగా లేదు’’అని ఈ సందర్భంగా జెలెన్ స్కీ అన్నారు.  తమ పొరుగు దేశమైన బెలారస్ కు ఆర్మీని పంపి యుద్ధ శిక్షణ కార్యకలాపాలు చేపట్టాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలిసిందని, అది నాటో కూటమికి ఎప్పటికైనా ముప్పేనని ఈ సందర్భంగా తెలిపారు.