PIB Fact Check: జిలేబీ, సమోసాలపై హెచ్చరికలు.. ఈ ప్రచారంలో నిజమెంత..? ఫ్యాక్ట్ చెక్లో ఏం తేలిందంటే..

PIB Fact Check: జిలేబీ, సమోసాలపై హెచ్చరికలు.. ఈ ప్రచారంలో నిజమెంత..? ఫ్యాక్ట్ చెక్లో ఏం తేలిందంటే..

జిలేబీ, సమోసాల గురించి వార్త ఒకటి ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఇవి అమ్మే స్టాల్స్ దగ్గర హెల్త్ వార్నింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలని కేంద్రం డిసైడ్ అయిందనేది ఆ ప్రచారం సారాంశం. సిగరెట్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లపై ఉన్నట్టుగా హెల్త్ వార్నింగ్ మెసేజ్లు ఇకపై ఈ స్నాక్స్ అమ్మే దగ్గర కూడా పోస్టర్లు, బోర్డుల రూపంలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఇదంతా ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రచారం అని.. PIBFactCheck తేల్చేసింది. ఈ ప్రచారం ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసింది.

కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసిన మాట వాస్తవమేనని.. అయితే ఆ అడ్వైజరీలో ఇండియాలో అమ్మే స్నాక్స్పై హెల్త్ వార్నింగ్ లేబుల్స్ ఉంటాయనే ప్రస్తావనే లేదని PIBFactCheck స్పష్టం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవన విధానానికి సంబంధించిన సలహాలను మాత్రమే ఆ అడ్వైజరీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తావించిందని తెలిపింది. అధిక మోతాదులో ఆయిల్ ఉండే ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ చక్కెర ఉండే ఫుడ్ తీసుకోవడం తగ్గించాలని మాత్రమే ఆ అడ్వైజరీలో ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అంతేతప్ప.. సమోసాలు, జిలేబీలను నిషేధించడం గానీ.. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ కల్చర్ను టార్గెట్ చేయడం గానీ జరగలేదని PIB Fact Checkలో తేలింది.

భారత్లో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోట్లు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లపై ప్రజలు శ్రద్ధ వహించాలని తెలిపే ఉద్దేశంతో  కేంద్రం ఈ సూచనలతో కూడిన అడ్వైజరీని విడుదల చేసింది. మితమైన ఆహారం తీసుకోవడం, రుచి కోసం వెంపర్లాడకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. వంటి లక్షణాలకు ప్రజలను మరింతగా అలవాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.