
హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర మంత్రి వర్గానికి బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. సీఎం కేసీఆర్ ఎట్టకేలకు మంత్రి వర్గాన్ని విస్తరించడం చాలా సంతోషమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక కొలువుదీరిన రెండో కేబినెట్ లోనూ మహిళలు, ఎస్టీలకు అవకాశం దక్కకపోవడం బాధాకరమని దత్తాత్రేయ అన్నారు. ఈ నెల 24న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగే ఓబీసీ సంమ్మేళనం వాల్ పోస్టర్ ఆయన రిలీజ్ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. సికింద్రబాద్ లో ఈ నెల 24న ఓబీసీ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నామని చెప్పారాయన. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి మాటల్లోనే ఆగిపోయిందని, చేతల్లో మరిచిపోయారని ఆరోపించారు.
హైదరాబాద్ ప్రత్యేకం
15వ ఫైనాన్స్ కమిషన్ ని బీజేపీ తరఫున కలిశామని ఆయన చెప్పారు. కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుతగులడాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరామని, హైదరాబాద్ ను ప్రత్యేకంగా చూడాలని, ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరామని దత్తాత్రేయ తెలిపారు.
గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు
పుల్వామా ఘటన వెనుక ఉన్న వారినెవరినీ మోడీ ప్రభుత్వం వదలదని దత్తాత్రేయ చెప్పారు. దేశవ్యాప్తంగా అనేక మంది వీర సైనికులకు నివాళి అర్పిస్తుంటే.. కొంత మంది నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పుల్వామా దాడి విషయంలో కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకే చందంగా మాట్లాడుతున్నారని అన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు.