తనిఖీల్లో వాహనదారులతో మర్యాదగా వ్యవహరించాలి : ప్రకాశ్ రెడ్డి

తనిఖీల్లో వాహనదారులతో మర్యాదగా వ్యవహరించాలి :  ప్రకాశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో  తనిఖీలు చేసే స్టాస్టిక్ సర్వేలెన్స్ టీమ్స్ (ఎస్ఎస్టీ) జనాలతో మర్యాదగా వ్యవహరించాలని ఎంసీసీ నోడల్ ఆఫీసర్, బల్దియా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి సూచించారు.  సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఎస్ ఎస్టీలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. నవంబర్ 3న సంబంధిత నియోజకవర్గాల్లో ఎస్ఎస్టీలు తమ విధులను నిర్వహించాలని తెలిపారు. ఈ టీమ్స్ విధులకు హాజరైన సమయంలో వీడియోగ్రఫీ ద్వారా తమ పేరు, లొకేషన్ నమోదు చేయాలన్నారు.

తనిఖీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంపించాలన్నారు.  ఎస్ఎస్టీల వాహనాలకు జీపీఎస్, సీసీ కెమెరాలు అమర్చామన్నారు. ఎలక్షన్ సంబంధిత క్యాష్​, బంగారం, లిక్కర్​ను సీజ్ చేసి ఎస్​హెచ్​వో ద్వారా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ గ్రీవెన్ సెల్ ద్వారా సీజ్ చేసిన క్యాష్​ను తగిన డాక్యుమెంట్లు తీసుకొస్తే పరిశీలించి రిలీజ్ చేస్తామన్నారు.

రూ. 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్​ పట్టుబడితే ఐటీ అధికారులకు రెఫర్ చేయాలని తెలిపారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఉచితంగా అందజేసే సామగ్రిపై నిఘా ఉంచాలన్నారు.   కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ అకౌంట్ శరత్ చంద్ర   పాల్గొన్నారు.