కిరాణా సామాను ఇచ్చేందుకు వెళ్లి.. మహిళపై అత్యాచారం

కిరాణా సామాను ఇచ్చేందుకు వెళ్లి.. మహిళపై అత్యాచారం
  •     నోయిడాలో డెలివరీ బాయ్ ఘోరం
  •     పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని పరార్

న్యూఢిల్లీ: కిరాణా సరుకులు ఇచ్చేందుకు వెళ్లిన డెలివరీ బాయ్.. ఇంట్లో ఒంటిరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల వద్ద లొంగిపోయినట్టే నటించిన ఆ యువకుడు.. వాళ్ల దగ్గరి నుంచి పిస్టల్ కొట్టేసి పారిపోయాడు. ఆపై పోలీసులు నానా తిప్పలు పడి అతడిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది.

ఒంటరిగా ఉందని గమనించి.. 

గ్రేటర్ నోయిడాలోని అపార్ట్​మెంట్​లో ఉంటున్న మహిళ శుక్రవారం ఓ యాప్​లో కిరాణా సామాన్ ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్​గా పనిచేస్తున్న సుమిత్ సింగ్(23) అనే యువకుడు ఆర్డర్ డెలివరీ చేసేందుకు ఆమె అడ్రస్​కు వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు గమనించి లోపలికి వెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యాడు. 

ఆ వెంటనే మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా సుమిత్​ నోయిడాలోనే ఉన్నట్లు తెలుసుకుని వెళ్లిన పోలీసులకు చిక్కినట్లే నటించిన నిందితుడు కానిస్టేబుల్ దగ్గరున్న పిస్టల్ తీసుకుని పారిపోయాడు. దీంతో పోలీస్ స్పెషల్ టీమ్​లు రంగంలోకి దిగాయి. వాళ్లంతా సుమిత్​ ఉన్న అడ్రస్ ట్రేస్ చేసి వెళ్లగా నిందితుడు పిస్టల్​తో కాల్చడం స్టార్ట్ చేశాడు. 

దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో సుమిత్ కాలుకి బులెట్ తగిలింది. ప్రస్తుతం అతడిని అరెస్ట్​ చేసి ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ అందిస్తున్నారు.