పేకమేడలా కుప్పకూలిన ట్విన్ టవర్స్

పేకమేడలా కుప్పకూలిన ట్విన్ టవర్స్
  • నోయిడా ట్విన్ టవర్స్..9 సెకన్లలో ఢమాల్
  • పేకమేడలా కుప్పకూలిన జంట భవనాలు
  • 3,700 కిలోల ఎక్స్​ఫ్లోజివ్స్​తో పేల్చివేత
  • 40 మీటర్ల ఎత్తుదాకా  దట్టమైన పొగ
  • చుట్టూ 30 మీటర్ల వరకు కంపించిన భూమి 
  • పగిలిన పక్క బిల్డింగ్​ల అద్దాలు, గోడలకు బీటలు

న్యూఢిల్లీ:   నోయిడా ట్విన్ టవర్స్ పేకమేడల్లా కుప్పకూలాయి. కేవలం తొమ్మిది సెకన్లలోనే జంట భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం చేపట్టిన ట్విన్ టవర్స్ కూల్చివేత విజయవంతంగా ముగిసింది. సరిగ్గా మధ్యాహ్నం 2.30 గంటలకు ట్విన్​టవర్స్​కు100 మీటర్ల దూరం నుంచి ముగ్గురు ఫారిన్ ఎక్స్​పర్ట్స్, ఎడిఫిస్ ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన చేతన్ దత్తా, ఓ పోలీస్ అధికారి, ప్రాజెక్ట్ మేనేజర్ మయూర్ మెహతా కలిసి బ్లాస్ట్ బటన్​నొక్కేశారు. ఆ వెంటనే కొన్ని సెకన్లలోనే రెండు భవనాలు కూలిపోయాయి. బిల్డింగ్స్ కూలడంతో దాదాపు 40 మీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగ కమ్ముకుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనాలుగా ఇవి రికార్డుకెక్కాయి. 

జలపాతం నీళ్లు దుంకినట్లుగా..  

కుతుబ్ మినార్ (73 మీటర్లు) కంటే ఎత్తయిన ట్విన్ టవర్స్ (103 మీటర్లు)ను కూల్చేందుకు మొత్తం 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. బిల్డింగ్స్​లోని పిల్లర్స్​లో మొత్తం 7,000 రంధ్రాలు చేసి ఎక్స్​ప్లోజివ్స్​ను నింపారు. బ్లాస్ట్​ కోసం 20,0‌‌‌‌‌‌‌‌00 సర్కిట్స్​ను ఉపయోగించారు. బిల్డింగ్ శిథిలాలు పక్కకు పడకుండా, జలపాతం నుంచి నీళ్లు కిందకు దుంకినట్లుగా పడిపోయే వాటర్‌‌‌‌ఫాల్ ఇంప్లోజన్ టెక్నిక్‌‌‌‌తో పని పూర్తి చేశారు. ఇక సుమారు 55 వేల టన్నుల శిథిలాల తరలింపు నోయిడా అధికారుల ముందు ఉన్న పెద్ద చాలెంజ్. ఆ ప్రాంతమంతా క్లియర్​ చేయాలంటే 3 నెలల టైం పట్టే చాన్స్ ఉంది. శిథిలాల్లో 4 వేల టన్నుల ఇనుము ఉంది.   

7 వేల మందిని తరలించి.. 

ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ట్విన్​ టవర్స్​ ఏరియాలో ట్రాఫిక్​దారి మళ్లించారు. 7 వేల మందిని అక్కడి నుంచి తరలించారు. గ్యాస్, పవర్ సప్లై ఆపేశారు. బిల్డింగ్స్ 450 మీటర్ల రేంజ్​లో ఉన్న గ్రేటర్​నోయిడా ఎక్స్​ప్రెస్​వేను ‘నో గో జోన్’గా ప్రకటించారు. మధ్యాహ్నం 2.15 నుంచి 2.45 వరకు వెహికల్స్​ రాకపోకలకు అనుమతివ్వలేదు. ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్​గా ప్రకటించారు. ట్విన్​టవర్స్​కు అతి దగ్గరగా 8 మీటర్ల దూరంలోనే ఓ బిల్డింగ్​ ఉంటే.. మిగతావి 12 మీటర్ల దూరంలో ఉన్నాయి. వాటన్నింటిని జియో టెక్స్​టైల్  అనే స్పెషల్ క్లాత్స్ తో కప్పేశారు.  జంట భవనాల్లో అపెక్స్ టవర్ (32 ఫ్లోర్లు) ఎత్తు 103 మీటర్లు కాగా, సియాన్ టవర్​ (29 ఫ్లోర్లు) ఎత్తు 97 మీటర్లు. సాయంత్రం 4 గంటల తర్వాత చుట్టుపక్క బిల్డింగ్స్​లో అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలు పునరుద్ధరించారు.  5:30 గంటలకు మాస్క్​లు వేసుకుని స్థానికులు వారివారి ఇండ్లలోకి  వెళ్లేందుకు పర్మిషన్​ఇచ్చారు.  

70 కోట్లతో కట్టి.. 20 కోట్లతో కూల్చిన్రు 

కూల్చివేతల్లో ఒక్కో చదరపు అడుగుకు రూ. 267 ఖర్చు కాగా, 8 లక్షల చదరపు అడుగుల్లో కట్టిన జంట భవనాల కూల్చివేతకు రూ. 20 కోట్లు ఖర్చు అవుతోంది. రూ. 70 కోట్లతో నిర్మించిన ఈ భవనాల ప్రస్తుత విలువ రూ.700  కోట్లని అంచనా. 
30 మీటర్ల వరకు ప్రకంపనలు ట్విన్ టవర్స్ కూలే సమయంలో కొన్ని సెకన్ల పాటు 30 మీటర్ల రేడియస్‌‌‌‌ వరకు భూమి కంపించింది. ఈ ప్రకంపనల పరిమాణం సెకనుకు దాదాపు 30 మిల్లీ మీటర్ల వరకు వెళ్లాయి. రిక్టర్ స్కేలుపై 0.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఎలా కంపిస్తుందో.. కూల్చి వేత సమయంలో నోయిడా టవర్స్‌‌‌‌ ప్రాంతం అలా కంపించింది. ఈ టవర్లు రిక్టర్ స్కేల్ పై 6 తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు.   ఇక భవనాల కూల్చివేతలో సహాయక చర్యల కోసం 560 మంది పోలీసులు, 100 రిజర్వ్‌‌‌‌ పోర్స్‌‌‌‌ సిబ్బంది, 4 క్విక్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌ టీంలు రంగంలో​కి దిగాయి. 

పక్క బిల్డింగ్స్ అద్దాలు పగిలినయ్ 

‘‘ట్విన్​టవర్స్ కూల్చివేతలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే 10 మీటర్ల దూరంలో ఉన్న బౌండరీ వాల్ కూలిపోయింది. పేలుడు ధాటికి ఏటీఎస్ విలేజ్​లోని బిల్డింగ్స్ అద్దాలు పగిలిపోయాయి. వీరికి నష్టపరిహారం సూపర్​టెక్​ కంపెనీయే అందిస్తుంది. బ్లాస్ట్​ టైంలో వెలువడిన దుమ్మూ, ధూళీని క్లియర్ చేశాం. దీని కోసం స్పెషల్ మెషిన్స్ ఉపయోగించాం. దుమ్ము వ్యాపించకుండా.. వాటర్​ స్ప్రింక్లర్స్ యూజ్​ చేశాం. యాంటీ స్మోక్ గన్స్ యాక్టివేట్​ చేశాం. కానీ శిథిలాలు మొత్తం తరలించేదాకా దుమ్మూ లేస్తూనే ఉంటది” అని ప్రాజెక్ట్​ మేనేజర్, ఎడిఫిస్ ఇంజనీరింగ్​అధికారులు వెల్లడించారు. 

ఎందుకు కూల్చారంటే..? 

యూపీలోని నోయిడాలో సూపర్ టెక్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్ ను నిర్మించింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నదని.. బిల్డింగ్స్ కు దగ్గరగా ఉన్న సూపర్​టెక్ ఎమరాల్డ్ సొసైటీ వాళ్లు 2012లో కోర్టుకు వెళ్లారు. ఈ ప్లేస్​లో గార్డెన్​ ఏర్పాటు చేయాలని కంపెనీకి వ్యతిరేకంగా కోర్టులో వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత.. నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని అలహాబాద్ హైకోర్టు నిర్ధారణకు వచ్చింది. ట్విన్ టవర్స్​ను కూల్చేయాలని జస్టిస్ డీవీ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన బెంచ్ 2014, ఏప్రిల్ 11న తీర్పు ఇచ్చింది. దీంతో సూపర్​టెక్​ కంపెనీ యాజమాన్యం సుప్రీం కోర్టుకు వెళ్లింది. పోయిన ఏడాది ఆగస్టు 31న సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3 నెలల టైం ఇచ్చింది. పలు కారణాలతో కూల్చివేత అమలుకు ఏడాది కాలం పట్టింది.  

కంపెనీకి రూ.500 కోట్లు నష్టం 

నోయిడా జంట భవనాలను కూల్చడంతో రూ.500 కోట్లు నష్టపోయామని సూపర్​టెక్ కంపెనీ చైర్మన్ ఆర్​కే అరోరా చెప్పారు. ‘‘ల్యాండ్, కన్​స్ర్టక్షన్ కాస్ట్, పర్మిషన్ చార్జీలు, అప్రూవల్స్ కోసం చాలా డబ్బు ఖర్చు చేశాం. లోన్​ తెచ్చాం. కొన్నేండ్లుగా వడ్డీ కడుతున్నాం. బయ్యర్స్​కు 12 శాతం వడ్డీతో డబ్బు చెల్లించాం. టవర్స్ కూల్చివేతతో కంపెనీ రూ.500 కోట్లు నష్టపోయింది. రెండు టవర్స్​లో మొత్తం 900 ఫ్లాట్స్. మార్కెట్​లో వీటి విలువ రూ.700 కోట్లు. టవర్స్ కూల్చేందుకు ఎడిఫిస్ కంపెనీకి రూ.17.50 కోట్లు చెల్లిస్తున్నాం.  కూల్చిన తర్వాత శిథిలాలకూ మేమే ఖర్చు చేస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.