- కామారెడ్డిలో ఫస్ట్ డే22 నామినేషన్లు
- నిజామాబాద్‌లో 21
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. కామారెడ్డిలో బుధవారం మొదటి రోజు నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 22 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్‌లో కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల్లో 21 నామినేషన్లు వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో పార్టీల వారీగా కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 నామినేషన్లు వచ్చాయి. - కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి 6, బీజేపీ 2, బీఆర్ఎస్ 5, ఇండిపెండెంట్ 1 వచ్చాయి. - బాన్సువాడ లో 3 , ఎల్లారెడ్డిలో 2 , బిచ్కుందాలో 3 ఫైల్ అయ్యాయి.
అలాగే.. నిజామాబాద్ కార్పొరేషన్‌లో మొదటి రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 3, 5, 18, 34, 36, 45, 47 డివిజన్ల నుంచి బీజేపీ తరపున ఒక్కొక్కటి; 13, 40, 55 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు; 36, 37 డివిజన్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున రెండు వార్డుల్లో, బీజేపీ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ తరపున ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. భీంగల్ మున్సిపాలిటీలో 8, 9, 10 వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు, 9వ వార్డు నుంచి బీఎస్పీ అభ్యర్థి ఒకరు నామినేషన్ వేశారు.
సర్టిఫికేట్ల కోసం రద్దీ
అభ్యర్థులు నో డ్యూస్ సర్టిఫికేట్ల కోసం మీ-సేవా సెంటర్లకు, మున్సిపాలిటీ కార్యాలయాలకు పరుగులు తీశారు. నామినేషన్‌తో పాటు అభ్యర్థి, ప్రపోజర్ ఇద్దరూ ఇంటి ట్యాక్స్, వాటర్ ట్యాక్స్‌లు పూర్తిగా చెల్లించి ఉండాలి. దీనిని ధృవీకరిస్తూ మున్సిపల్ కమిషనర్ జారీ చేసే నో డ్యూస్ సర్టిఫికేట్‌ను నామినేషన్ పత్రాలకు అటాచ్ చేయాలి. ఈ క్రమంలో ఆశావహులు ట్యాక్స్‌లు చెల్లించి, నో డ్యూస్ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మిగిలిన రెండు రోజుల గడువులో వీటిని సమర్పించనున్నారు.
కుల సర్టిఫికేట్లు, బ్యాంక్ అకౌంట్ల కోసం ..
రిజర్వేషన్ కేటగిరీ స్థానాల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తహసీల్దార్ల నుంచి తాజా కుల సర్టిఫికేట్ పొందాలి. షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజు నుంచే నామినేషన్లు ప్రారంభమవుతాయని ఊహించని రిజర్వ్డ్ కేటగిరీ ఆశావహులు కుల సర్టిఫికేట్ల కోసం అప్లికేషన్లు సమర్పించారు. తహసీల్దార్లు సర్టిఫికేట్ల పరిశీలన, జారీలో బిజీ అయ్యారు. పత్రాల మంజూరీలో జాగ్రత్తలు తీసుకోకపోతే కోర్టు కేసులు, వివాదాలు ఎదురవుతాయనే భయంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో పాత కుల సర్టిఫికేట్లపై తహసీల్దార్ అటెస్టేషన్‌తో నామినేషన్లు స్వీకరించినట్లే ఇప్పుడూ అదే పద్ధతిని అనుసరించాలని డిమాండ్ వస్తోంది. అలాగే, అభ్యర్థులు కొత్తగా ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, నామినేషన్‌లో ఇచ్చిన సమాచారం నిజమేనని ధృవీకరిస్తూ అఫిడవిట్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందజేయాలి. ఈ రెండింటి కోసం కూడా ఆశావహులు పరుగులు పడుతున్నారు.
అభ్యర్థిత్వం ఖరారు కానప్పటికీ పార్టీల తరపున నామినేషన్లు
పార్టీలు ఇంకా అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేయలేదు. కొందరు తమకే టికెట్ దక్కుతుందనే ఆశతో నామినేషన్లు వేస్తున్నారు. మరికొందరు ముందస్తుగా నామినేషన్ దాఖలు చేసి, తర్వాత బి-ఫారం సమర్పించవచ్చని భావిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొందరు ఆశావహులు తమకే టికెట్ ఖరారవుతుందని వార్డుల్లో ప్రచారం చేసుకుంటూ నామినేషన్లు కూడా వేశారు.
కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్చకుండ మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు అభ్యర్థిత్వం ఖరారు కోసం ప్రధాన పార్టీల ముఖ్య నేతల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. కొన్ని వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఇద్దరు-ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతుండగా, కొన్ని వార్డుల్లో ఒకరే ఉన్నారు. పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం
చేస్తున్నారు.
