ఉమ్మడి నల్గొండ జిల్లాలో బుజ్జగింపులు షురూ.. ఒక్కో పంచాయతీలో ఒకే పార్టీ నుంచి.. పోటాపోటీగా నామినేషన్లు

ఉమ్మడి  నల్గొండ జిల్లాలో బుజ్జగింపులు షురూ.. ఒక్కో పంచాయతీలో ఒకే పార్టీ నుంచి.. పోటాపోటీగా నామినేషన్లు
  • విత్ డ్రా చేసుకోవాలని సూచనలు
  • రానున్న ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని హామీలు
  • కాంగ్రెస్ లోనే ఎక్కువ సమస్య

యాదాద్రి, నల్గొండ, వెలుగు:  పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. మొదటి దశలో ఒక్కోచోట ఒకే పార్టీ  నుంచి ఒకటికి మించి  నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో మిగిలిన వారి నామినేషన్లను ఉపసంహరింప చేయడానికి లీడర్లు రంగంలోకి దిగి బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

 పోటాపోటీ నామినేషన్లు

పంచాయతీల్లో పార్టీరహిత ఎన్నికలైనప్పటికీ.. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రంగంలోకి దిగుతాయి. అంగబలం, అర్ధబలం ఉన్న వారిని ఎంపిక చేసి మద్దతు ప్రకటిస్తాయి. ఈ విధంగా మొదటి దశ జరిగే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమకు అనుకూలురైన వ్యక్తులను ప్రతిపాదించాయి. దీంతో ఆశించి భంగపడిన వారు కూడా పోటీగా నామినేషన్లు వేశారు. దీంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి

పంచాయతీలు 630, నామినేషన్లు 5,064

ఉమ్మడి  నల్గొండ జిల్లాలో మొదటి దశలో ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్లు భారీ  ఎత్తున దాఖలయ్యాయి. ఒక్కో పంచాయతీకి ఒక్కో పార్టీ నుంచి ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. ఇందులో కాంగ్రెస్​ నుంచే పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.  యాదాద్రి జిల్లాలో మొదటి దశలో 153 పంచాయతీల్లోఎన్నికలు జరగాల్సి ఉండగా 984, 1286 వార్డులకు గాను 3292 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సూర్యాపేట జిల్లాలో 159 పంచాయతీల్లో 1387, 1442 వార్డులకు గాను 3791 మంది నామినేషన్లు వేశారు. నల్గొండ జిల్లాలో 318 పంచాయతీల్లో 2693, 2870 వార్డులకు 8469 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 

బుజ్జగించే పనిలో లీడర్లు

పంచాయతీ ఎన్నికలు కాబట్టి పదుల సంఖ్య ఓట్లే గెలుపు, ఓటములను నిర్దేశిస్తాయి. ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడుతుందన్న ఆందోళన నెలకొంది. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్​కు చెందిన వారే ఎక్కువగా నామినేషన్లు వేయడంతో వారిని విరమింప చేయడానికి లీడర్లు రంగంలోకి దిగారు. డైరెక్ట్​గా ఫోన్లు చేసి సన్నిహితుల ద్వారా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్​ 3 నామినేషన్ల ఉపసంహరణ గడువు కావడంతో ఆలోగా ఒప్పించాలని ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. అయితే నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఎక్కువ మంది విముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.