పేపర్​ లీకేజీ నిందితులకు షాక్.. ఏడుగురిపై నాన్‌‌ బెయిలబుల్ వారెంట్​

పేపర్​ లీకేజీ నిందితులకు షాక్..  ఏడుగురిపై  నాన్‌‌ బెయిలబుల్ వారెంట్​

హైదరాబాద్‌‌, వెలుగు:  టీఎస్‌‌పీఎస్సీ పేపర్స్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హాజరు కాని ఏడుగురు నిందితులపై నాంపల్లి కోర్టు నాన్‌‌ బెయిలబుల్ వారెంట్‌‌ జారీ చేసింది. ఖమ్మంకు చెందిన సాయి లౌకిక్‌‌, అతని భార్య సాయి సుష్మిత సహా కేసులో 23, 25, 27, 28, 37వ నిందితులు శుక్రవారం విచారణకు హాజరు కావాల్సింది. కానీ వారు గైర్హాజరు పిటిషన్ ​వేశారు. వారి పిటిషన్​ను నిరాకరించిన కోర్టు.. నాన్​బెయిలబుల్ ​వారెంట్స్ ​జారీ చేసింది.

 ఏడుగురిని అరెస్ట్ ​చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. కాగా పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి  వరకు108 మంది నిందితులను సిట్‌‌ అరెస్ట్ చేసింది. ఈ కేసులో గతేడాది జూన్‌‌ 9న సిట్‌‌ప్రాథమిక ఛార్జ్‌‌షీట్‌‌ దాఖలు చేసింది. కేసు ట్రయల్స్‌‌లో భాగంగా శుక్రవారం కోర్టులో నిందితుల ఎగ్జామినేషన్ జరగాల్సి ఉంది. కేసు విచారణలో కీలకమైన దశలో నిందితులు రాకపోవడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారెంట్​జారీ చేశారు.