కోడ్ ఉల్లంఘన.. గ్రేటర్లో నాన్ లోకల్ లీడర్ల హల్​ చల్​

కోడ్ ఉల్లంఘన.. గ్రేటర్లో నాన్ లోకల్ లీడర్ల హల్​ చల్​
  • పోలింగ్ టైమ్ లోనూ ప్రచారం చేస్తూ ఓటర్లకు ప్రలోభాలు
  • కేపీహెచ్ బీలో మంత్రి పువ్వాడ అజయ్ డబ్బు పంపిణీ చేశారని
  • బీజేపీ నేతల ఆరోపణలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన వివిధ పార్టీల నాన్​లోకల్​ లీడర్లు  క్యాంపెయిన్ ముగిసినా వెళ్లిపోకుండా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ పోలింగ్ రోజున పలు డివిజన్లలో ప్రచారం చేసిన్రు. పోల్ మేనేజ్ మెంట్ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన్రు. కారు గుర్తుకే ఓటు వేయాలంటూ ఓటర్లను కోరడంతో పాటు డబ్బుల పంపిణీలోనూ కీలకంగా వ్యవహరించిన్రు. కేపీహెచ్ బీ లో స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సిటీలోని చాలా డివిజన్లలో మంగళవారం నాన్ లోకల్​ లీడర్ల హల్​చల్​కనిపించింది. దీంతో బీజేపీ లీడర్లు ఎక్కడికక్కడ టీఆర్ఎస్ లీడర్లను నిలదీసిన్రు. రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

రిగ్గింగ్​కు పాల్పడుతుందని..

ఉప్పల్ డివిజన్ లో వరంగల్ ప్రాంతానికి చెందిన వారితో కాంగ్రెస్ రిగ్గింగ్ కు పాల్పడుతోందంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలతో పోలింగ్ జరిగిందంటూ వరంగల్ హైవే పై బైఠాయించారు. పోలింగ్ ఏజెంట్లకు, ప్రిసైడింగ్ అధికారుల వద్ద ఉన్న పోలింగ్ లిస్టుకు భారీ తేడా ఉందని, డివిజన్ లోని ప్రతి బూత్ పరిధిలో 30 నుంచి 50 ఓట్ల రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఈ డివిజన్ పరిధిలో జరిగిన ఎన్నికలపై రీ పోలింగ్ జరపాలని ఎన్నికల సంఘానికి కంప్లయింట్​ చేసినట్లు చెప్పారు. ముషీరాబాద్ సెగ్మెంట్​లోని అడిక్ మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ క్యాండిడేట్​తరుఫున ఓటర్లను ప్రభావితం చేయడానికి స్థానికేతరులు అక్కడే ఉన్నారని లోకల్ లీడర్లు ఆందోళనకు దిగారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందిస్తూ అడిక్ మెట్ డివిజన్ లో మహబూబ్ నగర్ నేతలకు ఏం పని అంటూ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి తన అనుచరులతో కలిసి ఆర్కే పురం డివిజన్ లో పర్యటించారు. బూత్ నంబర్ 42 వద్ద టీఆర్ఎస్ కు ఓటేయాలంటూ ఓటర్లను కోరడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది.  మన్సూరాబాద్ డివిజన్ లోనూ పరిగి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎలాంటి సంబంధంలేని వ్యక్తులు ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

మంత్రి పువ్వాడ కారును అడ్డుకొని..

కూకట్ పల్లి డివిజన్ లో పోలింగ్ కేంద్రం వద్దకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారులో వచ్చి డబ్బులు పంచుతున్నారని బీజేపీ లీడర్లు చుట్టుముట్టారు. దీంతో టీఆర్ఎస్ , బీజేపీ మధ్య వివాదం ముదిరింది. బీజేపీ కార్యకర్తలు అడ్డుగా ఉన్నప్పటికీ మంత్రి కారును వేగంగా పోనివ్వడంతో ఓ బీజేపీ కార్యకర్త బానెట్ పై వేలాడాడు. కొంతదూరం వెళ్లక అతను కిందపడ్డాడు. కారుకు అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో కేపీహెచ్ పీ డివిజన్ ఇన్ చార్జి పెద్దిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

శివారులో మకాం

కోర్ సిటీలో కంటే శివారు ప్రాంతాల్లోని డివిజన్లలోనే నాన్ లోకల్ లీడర్లు తిష్ట వేశారు. సిటీ దాటి వెళ్లాలని అధికారులు ఆదేశించినా పట్టించుకోలేదు. పోలింగ్ పూర్తయ్యేంత వరకు డివిజన్ నేతలతో టచ్ లో ఉండాలంటూ టీఆర్ఎస్ ఇన్ చార్జ్ లను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో శివారులో ఉన్న హోటళ్లు, ఫాం హౌజ్ లు, రిసార్టుల్లో మకాం వేసి పోల్ మేనేజ్ మెంట్ చేశారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.