సిటీలోనే ఉంటున్న కూలీలపైనా లాక్ డౌన్ ఎఫెక్ట్

సిటీలోనే ఉంటున్న కూలీలపైనా లాక్ డౌన్ ఎఫెక్ట్
  • ఢిల్లీలో వర్కర్ల ఇన్ కమ్ 57శాతం తగ్గింది
  • యూఎస్, కెనడా వర్సిటీల స్టడీలో వెల్లడి

న్యూఢిల్లీ: వలస కూలీలతో పాటు నగరాల్లోనే స్థిరపడి పనులు చేసుకుంటున్న వర్కర్లపైనా లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. లాక్ డౌన్ తో ఢిల్లీలోని నాన్ మైగ్రెంట్ వర్కర్ల ఆదాయం బాగా తగ్గిపోయింది. వీరి వీక్లీ యావరేజ్ ఇన్ కమ్ 57 శాతం తగ్గిందని స్టడీలో తేలింది. మే తొలి వారంలో అయితే వీరి ఆదాయం సున్నా అని వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో, యూనివర్సిటీ ఆఫ్​బ్రిటీష్ కొలంబియా కలిసి ఈ స్టడీ చేశాయి. ఢిల్లీలో నివసిస్తున్న 1,392 మంది వర్కర్ల నుంచి డేటాను సేకరించి ఈ వివరాలను వెల్లడించాయి. 2018, 2019లో వర్కర్ల ఆదాయం, లాక్ డౌన్ లో ఇన్ కమ్ ను పోలుస్తూ రిపోర్టును విడుదల చేశాయి. ఒక వర్కర్ వీక్లీ యావరేజ్ ఇన్ కమ్ రూ.2,994 అయితే… అది తొలి దశ లాక్ డౌన్ లో రూ.1,828.64కు తగ్గిందని, రెండో దశ లాక్ డౌన్ లో రూ.412కు పడిపోయిందని స్టడీలో తేలింది.

మనుషులు మారిన్రు

లాక్ డౌన్ ఎకానమీతో పాటు ప్రజల బిహేవియర్ పైనా ప్రభావం చూపిందని రీసెర్చర్లు పేర్కొన్నారు. ఢిల్లీలో ఇప్పుడు ఎక్కువ మంది మాస్కులు వాడుతున్నారని, బయట తిరగకుండా ఇంట్లోనే ఉంటున్నారని, తరచూ చేతులు కడుక్కుంటున్నారని తెలిపారు. మాస్కులు వినియోగించే వారి సంఖ్య 20 శాతం నుంచి 90 శాతానికి… ఇంట్లోనే ఉంటున్న వారి సంఖ్య 44శాతం నుంచి 95శాతానికి… రెగ్యులర్ గా చేతులు కడుక్కుంటున్న వారి సంఖ్య 88శాతం నుంచి 98 శాతానికి పెరిగిందని స్టడీలో వెల్లడైంది. ఈ అలవాట్లు కరోనా నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయని… అయితే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజలు ఇవన్నీ పాటిస్తారా? అనేది ప్రశ్నార్థకమేనని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. దాదాపు 80శాతం మంది కరోనా విషయంలో భయాందోళన చెందుతున్నారని… లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత సిటీలో 80శాతం రాకపోకలు తగ్గాయని స్టడీలో వెల్లడైంది.