ఆత్మహత్యలొద్దు.. కొట్లాడి సాధించుకుందాం

ఆత్మహత్యలొద్దు.. కొట్లాడి సాధించుకుందాం
  • నిరుద్యోగులు, రైతులు, యువతకు రేవంత్ పిలుపు
  • ఉద్యోగుల పాలిట మరణశాసనంలా 317 జీవో
  • 1.91 లక్షల ఖాళీలున్నా జాబ్స్ భర్తీ చేస్తలే

మహబూబాబాద్/మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు, యువత ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కొట్లాడి హక్కులను సాధించుకుందామని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల జాడే లేదని మండిపడ్డారు. 317 జీవో.. ఉద్యోగుల పాలిట మరణశాసనంలా మారిందని విమర్శించారు. రైతుల బాధలను పట్టించుకోవడం లేదన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటించారు. 317 జీవో వల్ల నెల్లికుదురు మండలం సంధ్యా తండాలో గుండెపోటుకు గురై చనిపోయిన హెచ్ఎం జేతురామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మరణించి నెల రోజులు గడిచినా కనీసం జిల్లా కలెక్టర్, ఎడ్యుకేషన్ ఆఫీసర్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం విచారకరమని అన్నారు. జిల్లా కలెక్టర్ శశాంకతో ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి సహకారం అందించాలని కోరారు. మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో ఆత్మహత్య చేసుకున్న రైతు సంపత్ కుటుంబాన్ని, బయ్యారం మండలంలో నోటిఫికేషన్లు రాక ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబాన్ని పరామర్శించారు. 
 

ప్రజల బాధలను పట్టించుకునే నాథుడే లేడు
రాష్ట్రంలో ప్రజల బాధలను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌‌‌‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి సంబంధించిన 317 జీవోను స్థానికత నియమ నిబంధనలకు విరుద్ధంగా తీసుకువచ్చారన్నారు. దీని వల్ల ఎంతో మంది ఉద్యోగులు ఆవేదనకు లోనై చనిపోతున్నారని, కానీ సీఎం గుండె కరగడం లేదన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఖాళీలు ఉన్నప్పటికీ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువత నిరాశకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. 
 

రైతులకు దిక్కేదీ
‘‘రాష్ట్రంలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పింది. దీంతో కొంత మంది మిర్చి సాగు చేశారు. తెగుళ్లు సోకి పంట తీవ్రంగా నష్టపోయారు. తీవ్ర మనోవేదనకు గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించలేదు” అని రేవంత్ మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనకు టైం దగ్గరపడ్డదని, 18 నెలలు గడిస్తే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రేవంత్ అన్నారు.

కేసీఆర్‌‌‌‌ను గద్దె దించుతం
రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌ను వచ్చే ఎన్నికల్లో గద్దె దించుతామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. మూడోసారి తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. శనివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు వెళ్తున్న ఆయన.. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజలు కేసీఆర్‌‌‌‌కు అధికారం ఇస్తే ఫిరాయింపులు, అవినీతి, కాంట్రాక్టులతో కూడుకున్న రాజకీయాలను ప్రోత్సహించాడు. రుణమాఫీ, ఇండ్లు, నిరుద్యోగ భృతి, బీడి కార్మికులకు పెన్షన్, జర్నలిస్టులకు ఇండ్లు, ఆరోగ్య భద్రత కార్డులను ఇస్తానని నిండా ముంచాడు. నిరుద్యోగి సాగర్ రైలు కిందపడి చనిపోవడం కలచివేసింది, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం కాంగ్రెస్  పోరాడుతోంది’’ అని చెప్పారు.