చైనాలో 100 మందికి పైగా విద్యార్థులకు సోకిన 'నోరోవైరస్'.. అసలు ఏంటి ఈ వైరస్?

చైనాలో  100 మందికి పైగా విద్యార్థులకు సోకిన 'నోరోవైరస్'.. అసలు ఏంటి ఈ వైరస్?

సౌత్ చైనా గ్వాంగ్‌డాంగ్ లోని ఓ హైస్కూల్‌లో 103 మంది విద్యార్థులు ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడ్డారు. వీరందరికీ 'నోరోవైరస్' సోకినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ప్రస్తుతానికి విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది.

నోరోవైరస్ అంటే ఏంటి ?
నోరోవైరస్ అనేది చాలా వేగంగా వ్యాపించే ఒక రకమైన వైరస్. దీనిని సాధారణంగా 'స్టమక్ ఫ్లూ' అంటే కడుపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అని పిలుస్తారు.  ఈ వైరస్ సోకినప్పుడు కడుపులో మంట, వికారం, వాంతులు, విరేచనాలు వంటి  లక్షణాలు ఉంటాయి.

వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు స్కూల్  మొత్తాన్ని శానిటైజేషన్ చేసి శుభ్రం చేశారు. అనారోగ్యం బారిన పడ్డ విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికపుడు  గమనిస్తున్నారు. ఈ వైరస్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఎపిడెమియోలాజికల్ సర్వే కూడా జరుగుతోంది.

 చైనాలో అక్టోబర్ నుండి మార్చి వరకుఈ కాలంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 68 కోట్ల మందికి ఈ వైరస్ సోకుతుందని అంచనా. ఇందులో 5 ఏళ్ల లోపు పిల్లలే 20 కోట్ల మంది ఉంటున్నారు. ఈ వైరస్‌ చరిత్ర చూస్తే మొదటిసారి 1968లో అమెరికాలోని 'నార్వాక్' అనే పట్టణంలో గుర్తించారు. అందుకే దీనికి మొదట్లో 'నార్వాక్ వైరస్' అని పేరు ఉండేది. 

నోరోవైరస్  సంవత్సరానికి 200,000 మరణాలకు కారణమవుతుందని అంచనా, ఇందులో 50 వేల  పిల్లల మరణాలు ఉన్నాయి.  చాలామంది దీనిని 'ఫ్లూ' అని పిలుస్తారు, కానీ ఊపిరితిత్తులకు వచ్చే సాధారణ ఫ్లూ కంటే భిన్నమైనది. ఇది కేవలం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.