జపాన్‌ దీవిలోకి ఉత్తర కొరియా క్షిపణి

జపాన్‌ దీవిలోకి ఉత్తర కొరియా క్షిపణి

ఉత్తర కొరియా, జపాన్‌ దీవిలోకి ఇంటర్‌ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ICBM)ను ప్రయోగించింది. ఈ విషయాన్ని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఇది తమ ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఒషిమా దీవికి సమీపంలో హొక్కయిడోకు 200 కిలోమీటర్ల దూరంలో పడినట్లు పేర్కొంది. ఐసీబీఎం క్లాస్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించడం గత నవంబరు తర్వాత ఇదే తొలిసారి. కాగా దీన్ని 66 నిమిషాల పాటు ప్రయోగించారని జపాన్ స్పష్టం చేసింది. జనవరి ఒకటిన ఉత్తర కొరియా లాంగ్ రేంజ్ మిసైల్‌ను   ప్రయోగించిందన్న జపాన్.. ఆ తర్వాత అటువంటి మిసైల్‌ను ప్రయోగించడం ఇదే మొదటిసారని తెలిపింది. ప్యాంగ్యాంగ్‌ (ఉత్తర కొరియా రాజధాని)లోని సునన్ ప్రాంతం నుంచి దీనిని ప్రయోగించిందని వివరించింది.

మరో ముఖ్య విషయమేమిటంటే ఈ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా సైతం అధికారికంగా అంగీకరించింది. అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉందనే ఊహాగానాల నేపథ్యంలో అమెరికా, దక్షిణ కొరియా వచ్చే వారం వాషింగ్టన్‌లో మిలిటరీ డ్రిల్స్ నిర్వహించబోతున్నాయి. అయితే ఈ రెండు దేశాలు కలిసి తమపై దాడి చేయడానికి రిహార్సల్ చేస్తున్నాయని ఉత్తర కొరియా అభిప్రాయపడుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో గట్టి సమాధానం చెబుతామని అంతకుమునుపే శపథం చేసింది.