వ్యాపారి ఇంట్లో చోరీ కేసు..  నేపాల్ గ్యాంగ్ అరెస్ట్!

వ్యాపారి ఇంట్లో చోరీ కేసు..  నేపాల్ గ్యాంగ్ అరెస్ట్!
  • వాచ్​మన్ కుటుంబసభ్యులను ముంబయిలో పట్టుకున్న నార్త్​జోన్ పోలీసులు
  • 5.5 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి, రూ. 49 లక్షల క్యాష్ స్వాధీనం
  • పరారీలో ప్రధాన నిందితుడు కమల్

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  సింధి కాలనీలోని వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును నార్త్​జోన్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఇంట్లో వాచ్​మన్ గా పనిచేస్తున్న నేపాల్​కు చెందిన కమల్ ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. ముంబైలో కమల్ కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రధాన నిందితుడు కమల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ పరిధి సింధి కాలనీ పీజీ రోడ్​లోని ఓం శ్రీ అపార్ట్ మెంట్​లో రాహుల్ గోయెల్ కుటుంబం ఉంటోంది. నలుగురు అన్నదమ్ములు ఒకే చోట ఉంటుండగా.. వీరంతా రాణిగంజ్​లో ఐరన్ వ్యాపారం చేస్తున్నారు. నేపాల్ కు చెందిన కమల్ ఐదేండ్లుగా వీరి అపార్ట్​మెంట్​లో వాచ్​మన్​గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కమల్ అక్కడే ఉంటున్నాడు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో రాహుల్ గోయెల్, అతడి సోదరుల కుటుంబాలు ఈ నెల 9న సిటీ శివార్లలోని ఫాంహౌస్ కు వెళ్లాయి. సోమవారం తిరిగి ఇంటికొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అనుమానంతో రాహుల్..  వాచ్​మన్ కమల్ కోసం వెతకగా కనిపించలేదు. ఇంట్లోకి వెళ్లి బీరువాలో చూడగా.. రూ.49 లక్షల క్యాష్, 4 కిలోల బంగారం, 10 కిలోల వెండి, వజ్రాలు కనిపించలేదు. వాచ్ మన్ కుటుంబమే చోరీ చేసినట్లు భావించిన రాహుల్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు.  

నిందితులు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ముంబయి వెళ్లే రైలు ఎక్కినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా నార్త్ జోన్ పోలీసులు గుర్తించారు. బుధవారం ముంబయికి చేరుకున్నారు. సెల్​ఫోన్ సిగ్నల్స్ సాయంతో నిందితుల కోసం గాలించారు. ముంబయి బస్ స్టేషన్​లో బస్సు కోసం ఎదురుచూస్తున్న కమల్ కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులను గమనించిన కమల్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కమల్ కుటుంబసభ్యుల నుంచి రూ.5.5 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి నగలు, రూ.49 వేల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిని సిటీని తీసుకురానున్నట్లు సమాచారం. అయితే, నిందితులను పట్టుకున్న విషయాలను పోలీసులు వెల్లడించడం లేదు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు మాత్రమే చెబుతున్నారు.