2025లో మార్కెట్లోకి కోటి 50 లక్షల కొత్త ఇన్వెస్టర్లు.. ఈశాన్య రాష్ట్రాల జోరు..

2025లో మార్కెట్లోకి కోటి 50 లక్షల కొత్త ఇన్వెస్టర్లు.. ఈశాన్య రాష్ట్రాల జోరు..

2025లో భారత ఈక్విటీ మార్కెట్లు నిశ్శబ్ద విప్లవానికి కేంద్రంగా మారాయి. స్టాక్ మార్కెట్ సూచీలు నిలకడగా కొనసాగినప్పటికీ, ఇన్వెస్టర్ల తీరులో మాత్రం అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దలాల్ స్ట్రీట్‌కు దూరంగా ఉండే ఈశాన్య రాష్ట్రాలు, చిన్న పట్టణాల నుంచి కొత్త ఇన్వెస్టర్లు భారీగా పెరగటం ఈ ఏడాది అతిపెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. ప్రజల్లో పెట్టుబడులపై పెరుగుతున్న అవగాహన, ఫైనాన్షియల్ లిటరేచర్ దీనికి కారణాలుగా తెలుస్తోంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదిక ప్రకారం.. 2025లో భారతదేశంలో కొత్తగా 1.5 కోట్ల మంది ఈక్విటీ ఇన్వెస్టర్లు మార్కెట్లలోకి ప్రవేశించారు. దీనితో దేశంలోని మొత్తం రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య 12.4 కోట్లకు పెరిగింది. శాతం పరంగా చూస్తే.. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం (30% పైగా), అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ (25% పైగా) అగ్రస్థానంలో నిలిచాయి. ఇక సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఇన్వెస్టర్లు ఉన్నట్లు తేలింది. అయితే కేవలం ఉత్తరప్రదేశ్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య 17% వృద్ధితో 1.43 కోట్లకు చేరడం గమనార్హం.

అయితే ఈ లెక్కల్లో ఒక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తోంది. కొత్త ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రిటైల్ ట్రేడింగ్ యాక్టివిటీ మాత్రం తగ్గింది. గతేడదితో పోలిస్తే ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్‌లో ట్రేడింగ్ చేసే వారి సంఖ్య 9% తగ్గగా.. డెరివేటివ్స్ (F&O) విభాగంలో పాల్గొంటున్న వారి సంఖ్య ఏకంగా 26% పడిపోయింది. మార్కెట్లో ఒడిదుడుకులు పెరగడం, షేర్ల వాల్యుయేషన్లు గరిష్ట స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు తరచూ ట్రేడింగ్ చేయడం కంటే, పెట్టుబడులను దీర్ఘకాలం పాటు హోల్డ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోంది. 

మరోవైపు దేశంలో ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అంశాలపై అవగాహన పెంచేందుకు జరిగిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయి. 2025లో ఇన్వెస్టర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్సంఖ్య 167% పెరిగి 22వేల 448కి చేరింది. ఇందులో సుమారు 11.8 లక్షల మంది పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళా ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన కార్యక్రమాలు మూడు రెట్లు పెరగడం విశేషం. ఈ కార్యక్రమాల ద్వారా మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 2.8 రెట్లు పెరిగింది. మొత్తానికి 2025 భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో కేవలం లాభాల కోసమే కాకుండా.. భౌగోళికంగా, సామాజికంగా మార్కెట్ విస్తరణకు దారితీసినట్లు ఎన్ఎస్ఈ డేటా చెబుతోంది.