V6 News

రాష్ట్రం భగభగ.. ‘హీట్ కోర్ జోన్’లో ఉత్తర తెలంగాణ జిల్లాలు.. నార్త్ నుంచి వేడిగాలుల వల్ల టెంపరేచర్లు పైపైకి..

రాష్ట్రం భగభగ.. ‘హీట్ కోర్ జోన్’లో ఉత్తర తెలంగాణ జిల్లాలు.. నార్త్ నుంచి వేడిగాలుల వల్ల టెంపరేచర్లు పైపైకి..
  • పచ్చదనం, భూగర్భ జలాలు తగ్గడంతో పెరుగుతున్న ముప్పు 
  • ఇండస్ట్రియల్ జోన్, బొగ్గు గనులూ కారణం 
  • ఎత్తులో ఉండడం వల్ల దక్షిణాది జిల్లాలు కాస్త బెటర్ 
  • హైదరాబాద్ లాంటి సిటీలు ఎత్తులో ఉన్నా.. వేడి అధికం 
  • కాంక్రీట్ జంగల్స్​గా మారడంతో అర్బన్​ హీట్ ఐలాండ్స్ ప్రభావం  
  • రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ 46 డిగ్రీల టెంపరేచర్​
  • నిర్మల్ జిల్లా దస్తూరాబాద్​లో రికార్డ్.. 
  • 8 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే నమోదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పొద్దున తొమ్మిది గంటలకే ఎండ సెగ చురుక్కుమనిపిస్తోంది. ఇక మధ్యాహ్నం పూట కాలు బయటకు పెట్టాలంటేనే గుండె దడపుట్టించే స్థాయిలో వేడి తగులుతోంది. కొన్ని రోజులుగా రాష్ట్రమంతా భగభగ మండుతున్న నిప్పుల కొలిమిలా మారుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలతో పోలిస్తే ఉత్తర జిల్లాల్లో టెంపరేచర్లు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. 

ఎల్​నినో ప్రభావం కూడా ఉత్తర జిల్లాల్లోనే అధికంగా ఉంటుందని వెదర్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలపైనే వేడి ఎఫెక్ట్ ఎందుకు ఎక్కువగా ఉంటున్నది? అంటే..   ఆ ప్రాంతం ‘హీట్ కోర్ జోన్’లో ఉండటమే కారణమని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, జగిత్యాల, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ వంటి జిల్లాలు ఆ జోన్​లోనే ఉన్నాయని అంటున్నారు. 

ఉత్తరాదిన ఇతర రాష్ట్రాల నుంచి వీచే వేడి గాలుల వల్ల మన రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు. దానికితోడు గాలిలో తేమ తక్కువగా ఉండడం, సరిపడా అటవీ సంపద లేకపోవడం వంటి కారణాలు ఆయా ప్రాంతాలను హీట్ కోర్ జోన్​లో ఉండేలా చేస్తున్నాయని పేర్కొంటున్నారు. అంతేకాదు.. భూమ్మీద టెంపరేచర్లను రెగ్యులేట్ చేయడానికి గ్రౌండ్ వాటర్ కూడా కీలకం.. కానీ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోతుండడం వల్ల కూడా హీట్ రెగ్యులేషన్ జరగడం లేదని చెప్తున్నారు.

 దక్షిణాది జిల్లాలతో పోలిస్తే ఉత్తర జిల్లాలు తక్కువ ఎత్తులో ఉండడం కూడా టెంపరేచర్లు పెరగడానికి కారణమవుతున్నదని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. వాటన్నింటికీ తోడు.. అత్యంత వేడి ప్రాంతమైన మహారాష్ట్రలోని విదర్భకు చాలా దగ్గరగా ఉండడం వల్ల కూడా తెలంగాణలోని ఉత్తరప్రాంతంపై తీవ్రమైన ప్రభావం పడుతున్నదని పేర్కొంటున్నారు. 

  • పరిశ్రమలు, బొగ్గు గనుల వల్ల కూడా.. 

పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ వంటి జిల్లాల్లో పలు చోట్ల పరిశ్రమలు ఉండడం, బొగ్గు గనుల తవ్వకాలు జరుగుతుండడం వంటి కారణాలతోనూ ఉష్ణోగ్రతలు పీక్​కు చేరుకుంటున్నాయని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు.  ఉదాహరణకు రామగుండంలో ఎన్టీపీసీ.. భద్రాద్రి కొత్తగూడెంలో కేటీపీఎస్ వంటి ఇండస్ట్రీలున్నాయి. వీటి వల్ల వచ్చే రేడియేషన్ అత్యంత ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల కారణంగా కూడా టెంపరేచర్లు పీక్స్​కు చేరుతున్నాయి. రామగుండం, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలు ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశాల జాబితాలో టాప్​100లో నిలిచాయి.   

  • దక్షిణాది జిల్లాల్లోనూ ఎఫెక్ట్..

రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలతో పోలిస్తే దక్షిణాది జిల్లాల్లో హీట్ ఎఫెక్ట్ కొంచెం తక్కువే అయినా.. ఇటీవలి కాలంలో ఆ జిల్లాల్లోనూ వేడి బాగా పెరిగిపోతున్నది. దక్కన్ పీఠభూమిపై ఉండడం వల్ల ఈ ప్రాంతం ఇతర జిల్లాలతో పోలిస్తే కొంచెం చల్లగానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో ఇక్కడ కూడా పరిస్థితులు రివర్స్ అవుతున్నాయి. నల్గొండ జిల్లా కూడా కొన్నిసార్లు రెడ్ జోన్​లోకి వెళ్తోంది. ఈ జిల్లాలో అటవీ సంపద తక్కువగా ఉండడం, సున్నపురాయి మైనింగ్, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు వంటి కారణాలు టెంపరేచర్లు పెరిగేందుకు కారణమవుతున్నాయని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. 

  • హైదరాబాద్ లో వెట్ బల్బ్, హీట్ ఐలాండ్ ప్రభావం.. 

హైదరాబాద్ సిటీ సహా పట్టణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ సిటీలో తక్కువ ఉష్ణోగ్రతలే రికార్డ్ అవుతున్నా.. వేడి మాత్రం ఆయా జిల్లాల్లోని టెంపరేచర్ల స్థాయిలో ఉంటున్నది. దానికి కారణం ‘వెట్​బల్బ్’ ఎఫెక్ట్ అని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. టెంపరేచర్ తక్కువగానే ఉన్నా.. తీవ్రమైన ఉక్కపోతే (గాలిలో తేమ ఉండాల్సినదానికన్నా ఎక్కువగా) ఉంటే మన శరీరం తీసుకోలేదు. దీంతో వేడిమంట తీవ్రంగా అనిపిస్తుంది. 

ఉదాహరణకు టెంపరేచర్ 42 డిగ్రీలే రికార్డ్ అయినా.. దాని వేడి మాత్రం 45 నుంచి 46 డిగ్రీల రేంజ్​లో ఉంటుంది. అలాగే, ఎక్కడికక్కడ కాంక్రీట్ నిర్మాణాలు వెలియడం, అద్దాల మేడలు ఏర్పాటు కావడం వంటి కారణాలతో భూమిలోకి అబ్జార్బ్ అవ్వాల్సిన హీట్.. అంతా ఉపరితల వాతావరణంలోకి రిఫ్లెక్ట్ అవుతున్నది. దీనినే అర్బన్​హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటున్నారు. దానికితోడు సిటీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 

జంట నగరాల్లో ఆయా వాహనాలు ప్రతిరోజూ సగటున విడుదల చేస్తున్న కాలుష్యం, ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి రేడియేషన్ కలిపి 1,500 టన్నుల దాకా ఉంటున్నదని అంచనా వేస్తున్నారు. అందుకే ఇక్కడ టెంపరేచర్లు తక్కువే అయినా.. వేడి ఎక్కువగా ఉంటుందని
 చెబుతున్నారు.  

  • దస్తూరాబాద్ @ 46 డిగ్రీలు  

రాష్ట్రంలో పలు జిల్లాలు వరుసగా రెండో రోజూ రెడ్ జోన్​లోనే ఉన్నాయి. టెంపరేచర్ 46 డిగ్రీల మార్క్​ను టచ్ అయింది. మొత్తంగా 8 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్క నల్గొండ జిల్లా మినహా రెడ్ జోన్​లో ఉన్న మిగతా జిల్లాలన్నీ ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. మంగళవారం అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్​లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

నిజామాబాద్ జిల్లా కోరట్​పల్లిలో 45.9, ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 45.6, కామారెడ్డి జిల్లా కొల్లూరులో 45.5, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 45.2, జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో 45.1, కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్​లో 45.1, నల్గొండ జిల్లా ముల్కచర్లలో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలో 44.8, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 44.6, కరీంనగర్​లో 44.5, పెద్దపల్లిలో 44.3 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. 6 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా, 11 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. 

హైదరాబాద్ సిటీ పరిధిలో కార్వాన్, ఖైరతాబాద్ సర్కిళ్లు మినహా.. మిగతా 28 సర్కిళ్లలోనూ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగానే రికార్డయ్యాయి. అత్యధికంగా అంబర్​పేటలో 42.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, రామచంద్రాపురం, చందానగర్, ఎల్బీ నగర్, హయత్​నగర్, ఉప్పల్ లో 42.4 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. వచ్చే వారం రోజుల పాటు ఎండ మంటతోపాటు సాయంత్రం వేళల్లో వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.