ఫాక్స్‌బరో: కెరీర్‌లో తొలి వరల్డ్ కప్ ఆడుతున్న స్టార్ స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ (29, 43వ ని) రెండు సూపర్ గోల్స్ కొట్టడంతో.. గ్రూప్–ఐ లీగ్ మ్యాచ్‌లో నార్వే 4–1తో ఇరాక్‌ను ఓడించింది. 28 ఏళ్ల తర్వాత మెగా టోర్నీ ఆడుతున్న నార్వే అన్ని రంగాల్లో ఆకట్టుకుంది.
డేవిడ్ మోలర్ వోల్ఫ్ అందించిన క్రాస్‌ను హాలాండ్ కుడి మడమతో అద్భుతంగా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. కానీ 38వ నిమిషంలో ఇరాక్ ప్లేయర్ అమీర్ అలమ్మారి ఇచ్చిన పాస్‌ను ఐమెన్ హుస్సేన్ హెడర్ ద్వారా గోల్‌గా మలచడంతో లిచి స్కోరు 1–-1తో సమమైంది.
ఇక్కడి నుంచి హాలాండ్ తన చాతుర్యాన్ని ప్రదర్శించాడు. తొలి అర్ధభాగం ముగిసేలోపు.. ఇరాక్ డిఫెండర్ తన గోల్‌కీపర్‌కు ఇచ్చిన బ్యాక్ పాస్‌ను హాలాండ్ అడ్డుకున్నాడు. కీపర్ జలాల్ హసన్ కంటే ముందే బంతిని అందుకుని చాకచక్యంగా నెట్‌లోకి నెట్టాడు. దీంతో నార్వే 2–-1తో తిరిగి ఆధిక్యంలోకి వెళ్లింది.
రెండో అర్ధభాగంలో నార్వే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 76వ నిమిషంలో కెప్టెన్ మార్టిన్ ఒడెగార్డ్ అందించిన కార్నర్ కిక్‌ను లియో ఒస్టిగార్డ్ గోల్‌గా మార్చి జట్టు ఆధిక్యాన్ని 3-–1కి పెంచాడు. ఇంజ్యురీ టైమ్‌లో హాలాండ్ అందించిన పాస్‌ను క్రిస్టియన్ థోర్ట్స్ వెడ్ట్ గోల్‌గా మలచడంతో నార్వే 4–-1తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. తాజా గోల్స్‌తో హాలాండ్ అంతర్జాతీయ కెరీర్ గోల్స్ సంఖ్య 57కు చేరింది.
